Siddipet: బీఆర్ఎస్ కు ప్రతిష్ఠాత్మకమైన సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం ప్రతి ఎన్నికల్లోనూ అందరి దృష్టినీ ఆకట్టుకుంటుంది. గత ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావు అక్కడ లక్షకు పైగా మెజార్టీ సాధించి సంచలనం సృష్టించారు. ఈ సారి మెజార్టీని మరింత పెంచుకోవాలని హరీశ్ రావు, ఎలాగైనా సత్తా చాటాలని ఇతర పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థులు కొందరు బీఆర్ఎస్ కు అమ్ముడుపోయారంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై అక్కడి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
ఇది కూడా చదవండి: జెండా పాతాల్సిందే: తెలంగాణకు బీజేపీ అగ్రనేతల క్యూ.. వరుస పర్యటనలతో కార్యాచరణ
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను బీఆర్ఎస్ కు అమ్ముడు పోలేదని, ఎప్పటికీ బీజేపీతోనే ఉంటానని సిద్దిపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేశారు. పసుపు నీళ్లు మీద పోసుకుని, ఆలయంలో అగ్ని సాక్షిగా ఆయన ప్రమాణం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ కార్యకర్తలు, ప్రజలు తనపై జరుగుతున్న కుట్రను అర్థం చేసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి వేడుకున్నారు.