/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/gaddar-jahridhhun-jpg.webp)
గద్దర్ అంత్యక్రియల సమయంలో విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియల సమయంలో జరిగిన తోపులాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందారు. హార్ట్ స్ట్రోక్‌తోనే జహీరుద్దీన్ చనిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. గద్దర్‌ని కడసారి చూసేందుకు వచ్చిన జన సందోహంలో జహీరుద్దీన్ కూడా ఉన్నారు. గద్దర్‌కు జహీరుద్దీన్ అత్యంత సన్నిహితుడు. ఎడిటర్‌గా జహీరుద్దీన్‌కి మంచి పేరుంది.
గతంలో అనేక మంది ఆయన జర్నలిజంని కొనియాడారు. గతేడాది డిసెంబర్‌లో ఆయన్ను సౌదీకి చెందిన వ్యాపారవేత్తలు సన్మానించారు. ఇండియాన్ జర్నలిజంలో నిజాయితీతో కూడిన కమ్యూనిటీ సర్వీసెస్‌కు ఆయన్ను సత్కరించారు. గతేడాది సెప్టెంబర్‌లో జహీరుద్దీన్‌ని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఐపీఎస్-వీఆర్‌ఎస్ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారు. గతేడాది సియాసత్ ఉర్దూ ప్రింట్ మీడియాలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కలిశారు.
గద్దర్ భౌతికయానికి సీఎం కేసీఆర్ నివాళులు:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజా యుద్ధ నౌక గద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అల్వాల్‌లోని భూదేవినగర్‌లో గద్దార్ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. గద్దర్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. గద్దర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్.. గద్దర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఆయనతో పాటు మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అంతకుముందు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు గద్దర్ పార్థీవదేహానికి నివాళుతర్పించారు. విశ్రాంత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, నటులు మోహన్ బాబు, మంచు మనోజ్, అలీ, ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, తదితరులు నివాళులర్పించారు. అటు గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సంతాపం తెలిపారు. ఈ మేరకు గద్దర్ భార్య విమలారావుకు లేఖ పంపించారు.
అంతకముందు 6 గంటల పాటు భాగ్యనగరంలో 17 కిలోమీటర్లు అంతిమయాత్ర సాగింది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున కళాకారులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నేతలు, కళాకారులు గద్దర్‌కు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. గద్దర్ కడచూపు కోసం అభిమానులు, కవులు కళాకారులు భారీగా తరలివచ్చారు. రోడ్లన్ని కిక్కిరిసిపోయాయి. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన గద్దర్ ఆగస్టు 6 మధ్నాహ్నం తుదిశ్వాస విడిచారు.