ఒక మనిషి మూర్ఖత్వానికి, పిచ్చితనానికి రాష్ట్రం బలికావాలా.. అని చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ ఎంత దుర్మార్గుడు కాకుంటే.. సంపద సృష్టించే అమరావతిని చంపేస్తాడాని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్ లా అమరావతి సంపద సృష్టించే కేంద్రంగా ఈ రోజు మారేదని ఫైర్ అయ్యారు. జీవనాడి లాంటి పోలవరాన్ని జగన్ ముంచేశాడని టీడీపీ అధినేత మండిపడ్డారు.
ప్రకృతి వనరులు, ప్రైవేటు ఆస్తులు దోచేస్తూ.. జగన్మోహన్ రెడ్డి కబ్జాలు, సెటిల్మెంట్లతో వేల కోట్లు దండుకుంటున్నారని బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏసుక్రీస్తు సూక్తులకు విరుద్ధంగా జగన్ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. ప్రజా సంపద నాశనం చేసి, అప్పు చేయమని ఖురాన్ ఏమైనా చెప్పిందా అని బాబు సీఎం జగన్ ను నిలదీశారు.
ప్రజల్ని హింసించి పైశాచిక ఆనందం పొందాలని.. ఏ మతం చెప్పిందో జగన్ చెప్పాలని నిలదీశారు. ఇక కృష్ణా, గోదావరి నదుల్ని సక్రమంగా వినియోగించుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఎకరాకు నీళ్లివ్వొచ్చన్నారు బాబు. తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు తగ్గితే.. ఏపీలో మాత్రం పెరుగుతున్నాయన్నారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో ఏపీది మూడో స్థానమన్నారు బాబు.సాగును సీఎం జగన్ చంపేశాడని.. రైతును నట్టేట ముంచేశాడని.. జగన్‍కు వ్యవసాయంపై అవగాహన లేదని బాబు ఫైర్ అయ్యారు. గోదావరి జిల్లాల మొదలు రాయలసీమ వరకు జగన్ పాలనలో ఏ ఒక్క రైతు అయినా బాగున్నాడా..? అని బాబు నిలదీశారు.
జగన్ పాలనలో పుష్కలంగా సాగవుతున్న ఏకైక పంట గంజాయి అని బాబు ఎద్దేవా చేశారు. తప్పుడు లెక్కలు చూపడంలో జగన్ సిద్దహస్తుడని..ఏపీలో 93 శాతం రైతాంగం అప్పుల పాలైందన్నారు. దేశంలో సగటు రైతు అప్పు రూ.74 వేలు ఉంటే ఏపీలో సగటు రైతు అప్పు రూ.2,45,554 ఉందన్నారు. చేతగాని ప్రభుత్వానికి నాలుగేళ్ల జగన్ పాలనే నిదర్శనమన్నారు. ఇక ఏపీలో భూముల ధరలు.. వ్యవసాయంపై కేసీఆర్ కామెంట్లు చేస్తున్నారన్న బాబు.. ఒకప్పుడు ఏపీలో ఎకరం భూమి అమ్మితే హైదరాబాద్‍లో మూడెకరాలు కొనేవాళ్లని..ఇప్పుడు హైదరాబాద్‍లో ఒక ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనే దుస్థితి ఏర్పడిందన్నారు.
కరోనా సమయంలో అందరూ హాలిడే తీసుకుంటే ఒక్క రైతే పంట పండించి దేశానికి అన్నం పెట్టాడన్నారు. రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తే ధాన్యం సంచులు అందుబాటులో ఉండవని.. ఉన్న సంచులకు రంధ్రాలు ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు రైతులను పట్టుకుని ఓ మంత్రి వెర్రిపప్ప అంటాడా..? అని ఆయన మండిపడ్డారు. గోనే సంచులు మొదలు మిల్లర్ల వరకు ప్రతీ దానిలో దగా, మోసమే ఉందని ఆరోపించారు బాబు.సీమలో హార్టీ కల్చర్.. కోస్తాలో ఆక్వాకల్చర్ కు ప్రాధాన్యమిస్తే.. నేడు జగన్ పాలనలో రెండు కూడా సంక్షోభంలో ఉన్నాయన్నారు. ఆక్వా రైతాంగానికి టీడీపీ ప్రభుత్వం యూనిట్ రూ.2కు విద్యుత్ ఇచ్చింది.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్ రూ.3.8 చేశారన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను ఆక్వా చెరువులకు పారించామన్నారు.
ప్రతిపక్షాలపై కేసులు..వనరుల దోపిడే జగన్ పాలన అన్నారు.జగన్ అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. వ్యవస్థలను చంపేసి రివర్స్ గేర్‍లో నడిపిస్తున్నారని..సంక్షోభానికి కారణమైన జగన్‍కు పరిపాలించే అర్హత ఎక్కడిది..? అని చంద్రబాబు నిలదీశారు.రైతులపై అప్పుల భారం మోపిన జగన్ మాత్రం.. విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని బాబు ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే నేడు రైతులు టమాట వేయడం మానేశారని.. ఇప్పుడు టమాట ధరలు పెరగడానికి కూడా ఇదే కారణమని బాబు పేర్కొన్నారు. సీఎం జగన్‍కు ముందుచూపు లేదని.. ఎప్పుడూ పక్కచూపులేనన్న బాబు.. ముందుచూపుతో వ్యవహరిస్తే ఈ తిప్పులు ఉండేవి కావన్నారు.
టీడీపీ హయంలో 23 వేల ట్రాక్టర్లు ఇస్తే..ఇప్పుడు 6 వేల ట్రాక్టర్లు కూడా ఇవ్వలేదని,సూక్ష్మ పోషకాలు ఇవ్వట్లేదని, భూసార పరీక్షలు కూడా లేవని అందుకే పంట దిగుబడి తగ్గిందని బాబు అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్.. కోల్డ్ చెయిన్ లింకేజీ వ్యవస్థలను పటిష్టపరచాలని కృషి చేశామని కాని దౌర్భాగ్యం కలిసొచ్చి జగన్ సీఎం అయ్యారని.. రైతులు నాశనమయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక రాజధానిలో రైతుల భూమి వేరొకరికి దానం చేసిన జగన్ దానకర్ణుడా? అంత దానం చేసే గుణమే ఉంటే తన భూమి ఇవ్వొచ్చుగా? అని బాబు ప్రశ్నించారు. నేడు ఏపీ రాజధాని ఏదంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని బాబు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు.