మాజీ మంత్రి నారాయణ మరదలు వీడియోల వ్యవహారంలో ఊహించని ట్విస్టులు

మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదలు ప్రియ విడుదల చేసిన వీడియోలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. నారాయణపై ఆమె ఫిర్యాదుచేయడం.. ఆమెకు పిచ్చి అంటూ భర్త సుబ్రహ్మణ్యం వీడియో రిలీజ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మాజీ మంత్రి నారాయణ మరదలు వీడియోల వ్యవహారంలో ఊహించని ట్విస్టులు
New Update

నారాయణపై పోలీసులకు ఫిర్యాదు..

మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణపై ఆయన తమ్ముడు భార్య కృష్ణప్రియ చేసిన తీవ్ర ఆరోపణల వివాదంలో వరుస ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. తన భార్యకు మానసిక ఆరోగ్యం బాగాలేదని ఆమె వీడియోలను పట్టించుకోవద్దని నారాయణ సోదరుడు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. కానీ తాజాగా ఆమె రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది. తన బావ నారాయణ, భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తున్నారని ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫిర్యాదును అందజేశారు. తాను మానసిక ఆనారోగ్యంతో బాధపడుతున్నానని తన భర్త చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.

publive-image

మరదలు వీడియోలు వైరల్..

తనను 29 సంవత్సరాలుగా మాజీ మంత్రి నారాయణ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ప్రియ ఇన్‌స్ట్రాగామ్ వేదికగా వీడియోలను అప్‌లోడ్ చేశారు. అయితే ఆ వీడియోలో ఆమె కన్నీళ్లు పెట్టుకోకుండా నవ్వుతూ మాట్లాడుతుండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్ధులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో కూడా చెబుతానంటూ ఆ వీడియోలో తెలిపారు. ఇవి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

నా భార్యకు మానసిక అనారోగ్యం..

అయితే దీనిపై నారాయణ సోదరుడు, ప్రియ భర్త సుబ్రమణ్యం స్పందిస్తూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన భార్య మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారనీ, ఆమె మాటలు పట్టించుకోకూడదని విజ్ఞప్తి చేశారు. 2017 నుంచి ఆమెకు మానసిక వైద్య నిపుణులతో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని చెప్పారు. 2019లో ఆమె స్వగ్రామమైన గుంటూరులో కూడా చికిత్స చేయించామన్నారు. 2020లో కూడా హైదరాబాద్‌లోని డాక్టర్ విరంచి దగ్గర చూపించామని తెలిపారు. అయినా కానీ ఆమె తీరులో మార్పు రాలేదని చెబుతూ ఆ చికిత్సలకు సంబంధించిన రికార్డులను చూపించారు. ప్రస్తుతం క్యాన్సర్‌తో కూడా ఆమె బాధపడుతోందని ఈ నేపథ్యంలో ఆమె మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వివరించారు.

మొత్తానికి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్న నారాయణకు మరదలు వీడియోల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ అంశాన్ని రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల ప్రచారంగా మలుచుకునే అవకాశం ఉంది. మరి ప్రత్యర్థుల విమర్శలను నారాయణ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe