విజయవాడ (vijayawada) కనకదుర్గమ్మ(Kanaka durgamma) ఆలయంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో 3 వ రోజు అయిన మంగళవారం నాడు కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆధిభిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి.
మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు ‘ అమ్మ ‘ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. అన్నపూర్ణాదేవిని పూజిస్తే తిండికి లోటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ తల్లి సకల ఐశ్వర్యాలను ప్రసాదింస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారిని పూజించిన వారికి ఆకలి దప్పులు అనేవి ఉండవని చెబుతారు. అమ్మవారు ఈ రోజు గంధం రంగులో చీరలో భక్తులకు దర్శనం ఇస్తారు. తెల్లని పుష్పాలతో పూజిస్తారు. అమ్మవారికి ప్రసాదంగా దద్దోజనం నైవేద్యం పెడతారు.
ఈరోజు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు వివరిస్తున్నారు. నవరాత్రులకు రోజురోజుకి భక్తుల సంఖ్య పెరుగుతుందని ఆలయ అధికారులు చెబుతున్నారు.
ఇంద్రకీలాద్రి పై మొదటిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. రెండో రోజున అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో అమ్మవారి రూపానికి ఎంతో విశిష్టత ఉంది. శక్తికి మూలం దుర్గా మాత. ఈ అమ్మవారిని తొమ్మిది విభిన్న రూపాల్లో పూజించే రోజులు ఇవే.
నవరాత్రుల రెండవరోజు విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. భక్తుల రద్దీని కట్టడి చేసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అటు ప్రసాదాల విషయంలోనూ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. శనివారం నాటికి మూడు లక్షలకు పైగా లడ్డూలను అధికారులు రెడీ చేసినట్లు సమాచారం. ఇక చాలా దూరం నుంచి వచ్చే భక్తుల కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.
Also read: మంగళవారం ఇలా చేస్తే…దుర్గమాత అదృష్టాన్ని ప్రసాదిస్తుంది..!!