శంషాబాద్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. రూ.లక్ష కోసం హత్య

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమెను హత్యచేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు నిర్ధారించారు.

New Update
శంషాబాద్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. రూ.లక్ష కోసం హత్య

సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ హత్య కేసు మిస్టరీని 24 గంటల్లోనే పోలీసులు చేధించారు. మృతురాలను రాళ్ళగూడదొడ్డి ప్రాంతానికి చెందిన వడ్ల మంజులగా గుర్తించారు. మంజులను హత్యచేసిన రిజ్వాన బేగంతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలోనే ఈ హత్య జరిగినట్లు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. మంజుల కొన్నాళ్ల క్రితం రిజ్వాన అనే మహిళకు రూ.లక్ష అప్పుగా ఇచ్చిందని.. రెండు నెలలుగా వడ్డీ చెల్లించడం లేదన్నారు. దీంతో ఈ నెల 10న రిజ్వాన ఇంటికి వెళ్లిన మంజుల, ఆమె భర్త డబ్బులు తిరిగి ఇవ్వాలని గట్టిగా నిలదీయడంతో నిందితురాలు రిజ్వాన వారిపై కక్ష పెంచుకుందని పేర్కొన్నారు.

మరోసారి డబ్బులు తిరిగి ఇవ్వమని మంజుల అడగడంతో వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుందన్నారు. రెండు రోజుల కిందట మంజుల కడుపునొప్పి వస్తుందని శంషాబాద్‌ ఆస్పత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిందని.. తిరిగి రాకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన వివరించారు. మంజుల ఒంటరిగా వెళ్లడం చూసిన రిజ్వాన కంట్లో కారం చల్లి త‌న ఇంటిలోకి లాక్కెళ్లి చీరకొంగుతో ఉరివేసి హత్య చేసిందన్నారు. హత్య అనంతరం మంజుల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని.. అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని శంషాబాద్‌లోని శ్రీనివాస ఎన్‌క్లేవ్‌ వద్దకు తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించిందని చెప్పారు. రిజ్వానకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

అంతకుముందు శంషాబాద్‌లోని శ్రీనివాస ఎన్‌క్లేవ్‌ వద్ద సగం కాలిపోయిన గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె భర్త చెప్పిన పోలికలు, ఘటనాస్థలి వద్ద మృతదేహంతో సరిపోలడంతో హత్యకు గురైంది మంజులగా పోలీసులు నిర్థారించారు. మంజుల మెడలో ఉన్న తాళి బొట్టు, చెవి కమ్మలు, కాళ్ల కడియాలు లేవని కుటుంబసభ్యులు గుర్తించారు. ఆభరణాల కోసమే హత్య చేసి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. కానీ మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. దాంతో అసలు విషయం వెలుగు చూసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు