/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bhagat-singh-shaheed-diwas-jpg.webp)
Martyr's Day 2024 : 'పెంపుడు కుక్కను ఒళ్లో కుర్చోబెట్టుకుంటాం, కానీ సాటి మనిషిని ముట్టుకుంటే మైల పడిపోతాం.. ఎంత సిగ్గుచేటు..' అంటాడు భగత్ సింగ్ (Bhagat Singh). ఈ విప్లవవీరుడు గురించి ఎప్పుడు మాట్లాడుకునే సందర్భం వచ్చినా ఆయన్ను స్వాతంత్ర్య సమరయోధుడుగానే ప్రభుత్వాలు కీర్తిస్తుంటాయి. చిన్నతనం నుంచి అదే విషయాన్ని పుస్తకాల ద్వారా పిల్లల్లో నూరిపోస్తాయి. ఇదంతా నిజమే. భగత్‌సింగ్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం, విముక్తి కోసం పోరాడిన వీరుడే.. ఇందులో మరోమాట లేదు. అయితే భగత్‌సింగ్‌ని స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదు. ఆయన భావజాలం, సిద్ధాంతాలు, అంటరానితనంపై ఆయన విప్పిన గళం గురించి తెలుసుకోకపోతే భగత్‌సింగ్ పూర్తిగా అర్థంకాడు. ఆయన నాస్తికత్వాన్ని నాటి, నేటి పాలకులు ఎంత దాచినా అది వ్యాపిస్తూనే ఉంటుంది. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూనే ఉంటుంది. ఇవాళ(మార్చి 23) షాహీద్ దివాస్ (Shaheed Diwas). భగత్ సింగ్, సుఖ్ దేవ్ (Sukhdev), రాజ్ గురుల (Rajguru) త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. దేశ ప్రజలను బానిస బతుకుల నుంచి విముక్తి చేయడానికి అసమాన కృషి చేసిన విప్లవవీరులు వీరు. బ్రిటీష్ అధికారి సాండర్స్ హత్య కేసులో దోషిగా తేలిన ఈ ముగ్గురిని 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. ఇదంతా అందరికి తెలిసిన విషయం. ప్రభుత్వాలు ప్రతీఏడాదీ గుర్తుచేసే అంశం. అయితే భగత్‌సింగ్ గురించి ఎన్నో విషయాలను దాచిపెట్టే ప్రయత్నాలు చేశాయి ప్రభుత్వాలు. మతతత్వం, కులోన్మాదంపై భగత్‌సింగ్ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనివ్వకుండా జాగ్రత్త పడ్డాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bhagath-sing2-jpg.webp)
నేను ఎందుకు నాస్తికుడిని?
దేవునిపై విశ్వాసం, రోజువారీ ప్రార్థన మనిషికి ఉన్న అత్యంత స్వార్థపూరితమైన విషయంగా భావించాడు భగత్‌సింగ్ (Bhagat Singh). అన్ని ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొన్న నాస్తికుల గురించి చదివిన భగత్‌సింగ్.. ఉరికంబం వరకు తల పైకెత్తి మనిషిలా నిలబడ్డాడు. విశ్వాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడైన దేవుడు ఉన్నాడని మీరు విశ్వసిస్తే, దయచేసి ఆయన దానిని ఎందుకు సృష్టించాడో తనకు చెప్పాలని నిలదీశాడు భగత్‌సింగ్. బాధలతో నిండిన ప్రపంచం, ఏ ఒక్క వ్యక్తి కూడా పూర్తిగా సంతృప్తి చెందని లోకాన్ని ఎందుకు సృష్టించాడో చెప్పాలన్నాడు. కర్మఫలితాలు లాంటి వాటికి దేవుడు కట్టుబడి ఉంటే అతను సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడో చెప్పాలన్నాడు. ఇలాంటి చట్టాలు పెట్టుకున్న దేవుడు కూడా మనలాగే నియమాలకు బానిసా అని ప్రశ్నించాడు. 'నేను ఎందుకు నాస్తికుడిని' అంటూ భగత్‌సింగ్ రాసిన పుస్తకం పెను సంచలనం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bhagath-singh-jpg.webp)
అంటరానితనంపై గళం విప్పిన యోధుడు:
23 ఏళ్ల వయసులో దేశం కోసం ఉరి తాడును ముద్దాడిన భగత్‌సింగ్ చిన్నతనంలోనే మతోన్మాదం, అంటరాని సమస్య లాంటి వాటిపై పదునైన కలంతో తన గళాన్ని విప్పాడు. భగత్‌సింగ్ వ్యాసాలు నాటి పీడిత వర్గాల్లో చైతన్యాన్ని నింపాయి. అదే సమయంలో అగ్ర కుల అహంకారులకు వెన్నులో వణుకు పుట్టించాయి. భగత్‌సింగ్ వ్యాసాలు కేవలం విమర్శతోనే నిండి ఉండేవి కావు.. సామాజిక సమస్యల పరిష్కారాలను తన వ్యాసాల ద్వారా ఎంతో హేతుబద్దంగా వివరించాడు భగత్‌సింగ్. స్వేచ్ఛ, స్వాతంత్రాల అసలు అర్థమేంటో ఆయన వ్యాసాల ద్వారానే నాటి ప్రజలకు తెలిసివచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bhagath-sing3-jpg.webp)
ఈ విషయాలు ఎందుకు చెప్పరు?
ప్రగతి కోసం నిలబడే ఏ వ్యక్తి అయినా మతంలోని అహేతుకుమైన ప్రతి అంశాన్ని విమర్శించాలన్నాడు భగత్‌సింగ్. గుడ్డి విశ్వాసం ప్రమాదకరమని.. ఇది మెదడును మందగించేలా చేస్తుందన్నాడు. జీవిత లక్ష్యం మనసును అదుపులో ఉంచుకోవడం కాదని.. సామరస్యంగా పెంపొందించుకోవడమన్న భగత్‌సింగ్ తత్వం గురించి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సామాజిక పురోగతి కొద్దిమంది సంక్షేమంపై కాకుండా ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేయడంపై ఆధారపడి ఉంటుందని చెప్పిన భగత్‌సింగ్.. సామాజిక, రాజకీయ, వ్యక్తిగత జీవితంలో సమాన అవకాశాలు లభించినపుడే విశ్వ సౌభ్రాతృత్వాన్ని సాధించగలమన్నాడు. భగత్‌సింగ్ తత్వం ఆచరణలోకి వచ్చి ఉంటే దేశంలో మతతత్వం, కులోన్మాదం, అంటారితనం ఏనాడో నశించి ఉండేవి. భగత్‌సింగ్‌ను స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా ఆయన తత్వాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకోని వెళ్లి ఉంటే అలానే జరిగి ఉండేదేమో!
Also Read: కేజ్రీవాల్ అరెస్టు.. ఎన్నికల ప్రధాన అధికారిని కలవనున్న ఇండియా కూటమి
Follow Us