కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల పరిధిలోని రామేశ్వర్ పల్లిలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను షబ్బీర్ అలీ పరిశీలించారు. మోకాలు లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లిన ఆయన.. బాధితులతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన షబ్బీర్ అలీ.. కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. 1500 కోట్లతో ప్రగతి భవన్‌ను, 15 వేల కోట్లతో సచివాలయాన్ని నిర్మించుకున్న కేసీఆర్ ప్రజలకు మాత్రం నీటిలో ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు.
నాణ్యతలేని ఇళ్లు నిర్మించి కేసీఆర్ కాంట్రాక్టర్ల జేబులు నింపారని ఆరోపించారు. గతంలో టేక్రియాల్‌లో నాణ్యత లేని ఇళ్లను ప్రత్యక్షంగా చూశామన్న ఆయన.. ఇప్పుడు రామేశ్వర్ పల్లిలో నీటిలో మునిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలంటే చిన్న చూపని షబ్బీర్ అలీ విమర్శించారు. కేసీఆర్ అవినీతిని తర్వలో బయటపెడుతామన్న ఆయన.. బీఆర్ఎస్ అధినేత జైలుకు వెళ్లే రోజులు ముందే ఉన్నాయన్నారు. మరోవైపు కేసీఆర్‌కే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని షబ్బీర్ అలీ తెలిపారు.
శుక్రవారం నుంచి ఆర్టీఏ ద్వారా తీర్మాన కాపీలను తీసుకోబోతున్నట్లు తెలిపిన ఆయన.. పంచాయతీ కార్యదర్శి ఇవ్వకపోతే సస్పెండ్ చేపిస్తామని హెచ్చరించారు. మరోవైపు కేసీఆర్‌పై మండిపడ్డ ఆయన.. కేసీఆర్ కన్ను కామారెడ్డి రైతులు భూములపై పడిందన్నారు. అందుకే కేసీఆర్ ఇక్కడికి వస్తున్నారని విమర్శించారు. కామారెడ్డి ఉద్యమాల గడ్డ అన్న ఆయన.. ఇక్కడి ప్రజలు రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో పాల్గొన్నారని, ప్రస్తుతం నియంత పాలన నుంచి విముక్తి పొందేందుకు సైతం పోరాటాలు చేస్తున్నారని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.