హర్యానాలోని నుహ్‌లో సోమవారం జరిగిన హింసాకాండ తర్వాత జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 44 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పుకార్లు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నూహ్‌లో నేటికీ ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగనుంది. హర్యానాలోని నుహ్, సోహ్నాలో హింసాకాండ తర్వాత ఉద్రిక్తత కొనసాగుతోంది. మంగళవారం రాత్రి, గురుగ్రామ్‌లోని సెక్టార్ 70-Aలో మూడు చోట్లా షాపులకు నిప్పు పెట్టారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
హర్యానాలోని నుహ్‌లో హింసాత్మక ఘటనకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు 15 బృందాలను ఏర్పాటు చేశారు. సీఐడీ కూడా ఈ వ్యవహారంపై ఇన్‌పుట్‌లు సేకరిస్తోంది. జిల్లాలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారు. హర్యానాతో అనుసంధనమైన రాజస్థాన్‌లోని భరత్‌పూర్ సరిహద్దును కూడా మూసివేశారు. ఆందోళనల దృష్ట్యా జిల్లా డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వార్ 144 సెక్షన్‌ను అమలు చేశారు. ఈరోజు కూడా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఎలాంటి వదంతులు వ్యాపించకుండా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
నుహ్‌లోని హింస గురుగ్రామ్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా వ్యాపించింది, దీని కారణంగా గురుగ్రామ్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. గురుగ్రామ్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని అధికార యంత్రాంగం ట్వీట్ చేసింది. ఈరోజు కూడా పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఎలాంటి వదంతులను పట్టించుకోవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుర్గావ్‌లోని బాద్‌షాపూర్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) ఫ్లాగ్ మార్చ్‌ను చేపట్టింది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల కోసం ఈ ఫ్లాగ్‌మార్చ్‌ను చేపట్టారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని... శాంతిభద్రతల పరిరక్షణకు అప్రమత్తంగా ఉన్నామంటూ పోలీసులు ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని తెలిపారు. ఏదైనా సహాయం కావాలంటే వెంటనే 112కి కాల్ చేయమని అభ్యర్థించారు.
సోమవారం నుహ్‌లో అల్లర్ల తర్వాత, మంగళవారం రోజంతా గురుగ్రామ్‌లోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మధ్యాహ్నం బాద్‌షాపూర్ ప్రాంతంలో పది స్క్రాప్ షాపులకు నిప్పుపెట్టిన దుండగులు రాత్రి 9 గంటలకు సెక్టార్ 70ఎలోని రెండు దుకాణాలకు కూడా నిప్పు పెట్టారు. మంటలు చెలరేగడంతో పోలీసులు సెక్టార్ 29 అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు రెండు అగ్నిమాపక దళ వాహనాలను రప్పించారు. కొద్దిసేపటికే మంటలు అదుపులోకి వచ్చాయి.
నుహ్ లో జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన గురుగ్రామ్‌లోని ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు హర్యానా పోలీసులు రూ.57 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు . మంగళవారం, గురుగ్రామ్ పోలీస్ కమీషనర్ ఒక ప్రకటన విడుదల చేసి, బంధువులకు అన్ని సహాయాలు అందజేస్తామని తెలిపారు.