Sankranti Movies 2025: మన సినిమాలకు గతంలో మూడు పెద్ద సీజన్లు. ఒకటి సంక్రాంతి.. రెండు వేసవి సెలవులు.. మూడు దసరా. అయితే, వీటిలో కూడా సంక్రాంతి, వేసవి సెలవులు టార్గెట్ గానే పెద్ద హీరోల సినిమాలు రెడీ అయ్యేవి. సినిమా హిట్..ఫ్లాప్ తో సంబంధం లేకుండా మినిమమ్ కలెక్షన్స్ గ్యారెంటీ అనే నమ్మకమే దీనికి కారణం. అది కూడా చాలావారకు నిజమే. వేసవి సెలవుల్లో (Summer Release) విడుదలైన సినిమాలు సెలవు రోజులు ఎక్కువగా ఉండడంతో ఓ మోస్తరుగా ఉన్నా థియేటర్ల వద్ద సందడి కనిపించేది. ఇక సంక్రాంతి ఎప్పుడూ ఒక స్పెషల్. కుటుంబాలతో జరుపుకునే పెద్ద మాస్ పండగ.. కావడంతో మాస్ సినిమాలకు ఎప్పుడూ సంక్రాతి టార్గెట్ గా ఉండేది. అయితే, ఇప్పుడు సీన్ మారిపోయింది.
పెద్ద హీరోలే కాదు.. చిన్న హీరోలు కూడా వేసవి వద్దు.. సంక్రాంతే ముద్దు అంటున్నారు. దీనికి కారణం ఒక్కటే.. అది ఐపీఎల్. మన దేశంలో సినిమా.. క్రికెట్ రెండూ అతి పెద్ద వినోదం ప్రజలకు. కానీ.. రెండింటిలోనూ క్రికెట్ కు ఉండే క్రేజ్ వేరు. క్రికెట్ మ్యాచ్ ఉంటె.. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. అది ఎంత సూపర్ హిట్ అయినా.. మొదటి ప్రాధాన్యత క్రికెట్ కె ఇస్తారు. అది గల్లీ క్రికెట్టా.. వరల్డ్ కప్ మ్యాచా ఇలాంటి సంబంధం ఏమీ ఉండదు. క్రికెట్ మ్యాచా కాదా అనేదే లెక్క. ఇదిగో సరిగ్గా దీనిని బేస్ చేసుకునే ఐపీఎల్ ప్రారంభించింది బీసీసీఐ. ఐపీఎల్ (IPL) టోర్నీ వేసవిలో నిర్వహిస్తుండడంతో సినిమాలకు కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి అనేది వాస్తవం. ప్రతి రోజూ మొదటి ఆట, రెండో ఆట సినిమాలకు జనం థియేటర్లకు వెళ్లడం లేదు. శని, ఆదివారాల్లో అయితే, మ్యాట్నీకి కూడా ఐపీఎల్ దెబ్బ పడుతోంది. దీంతో తమ సినిమాలో కంటెంట్ ఎంత బలంగా ఉన్నా వేసవి సెలవుల్లో సినిమా విడుదల చేయడం అంటే పెద్దగా ఇష్టపడటం లేదు మన హీరోలు.
Also Read: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమాన సంస్థగా ఇండిగో
దీంతో అందరూ సంక్రాంతి(Sankranti Movies) బరిలోనే దిగుతున్నారు. మధ్యలో వచ్చే దసరా వైపు కూడా పెద్దగా హీరోలు వెళ్లడం లేదు. అందరూ సంక్రాంతి అనే అంటున్నారు. దీంతో సంక్రాంతికి స్క్రీన్స్ కోసం దాదాపుగా యుద్ధాలే జరుగుతున్నాయి. మొన్న సంక్రాంతికి జరిగిన రచ్చ ఇందుకు ఉదాహరణ. రోజుల గ్యాప్ లో నాలుగైదు సినిమాలు విడుదలైతే.. సంక్రాంతికి ఏ సినిమాకి ఎన్ని స్క్రీన్స్ దక్కుతాయి?
అసలే ఓటీటీ దెబ్బకు థియేటర్స్ కి వెళ్లే జనమే తగ్గిపోయారు. మంచి కంటెంట్.. అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఉంటేనే ఇల్లు కదిలి సినిమా వైపు వెళుతున్నారు ప్రేక్షకులు. మరి ఇలాంటి పరిస్థితిలో.. ఈ సంక్రాంతి రచ్చ విషయం తెలిసీ పెద్ద హీరోలంతా వచ్చే సంక్రాంతికి కర్చీఫ్ లు వేసేశారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరతో సంక్రాంతి బరిలో ఉన్నానని ముందుగానే చెప్పేశారు. ఇక దిల్ రాజు (Dil Raju) కూడా సంక్రాంతి టార్గెట్ గా సినిమాతో వస్తున్నారు. రవితేజ (Ravi Teja) సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమాకి సంక్రాంతి రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. ఇక అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ సినిమా సంక్రాంతి బరిలో ఉంది అంటున్నారు. ఈఏడాది సంక్రాంతికి సంచలనం సృష్టించిన హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కూడా సంక్రాంతికే అని ప్రశాంత్ వర్మ గతంలో చెప్పారు. ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ సినిమా సంక్రాంతికే అంటున్నారు దర్శకుడు మారుతి.. మరోవైపు నాగార్జున కూడా బంగార్రాజు 3 అంటూ సైలెంట్ గా సంక్రాంతి కోసం రెడీ అయిపోతున్నారని టాక్.. మొత్తంగా చూస్తే దాదాపు పది సినిమాలు 2025 సంక్రాంతిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. మరి ఈ ఏడాది రచ్చ వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందన్న మాట. ఎందుకంటే, ఇప్పుడు అన్ని సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి కదా.. అలానే సంక్రాంతి సినిమాల స్క్రీన్స్ రచ్చకు కూడా సీక్వెల్ రెడీ చేస్తున్నట్టున్నారు మన హీరోలు. చూద్దాం ఎవరు నిలుస్తారో.. ఎవరు గెలుస్తారో..