Sankranti Movies: సంక్రాంతి సినిమా పంచాయతీ.. ఈసారి తగ్గేది ఎవరో.. నెగ్గేది ఎవరో?

ఈసారి సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు బరిలోకి దిగడానికి సిద్ధం అయిపోయాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగా, ఈగిల్ ఏ ఐదూ సంక్రాతి పందేనికి రెడీ అంటున్నాయి. ఇప్పుడు వీటికి ధియేటర్ల సమస్య ఉందని.. ఒకటి రెండు సినిమాలు వాయిదా వేసుకోవాలనీ దిల్ రాజు చెబుతున్నారు. 

New Update
Sankranti Movies: సంక్రాంతి సినిమా పంచాయతీ.. ఈసారి తగ్గేది ఎవరో.. నెగ్గేది ఎవరో?

Sankranti Movies: సంక్రాంతి వస్తుందంటే.. కోడిపందాలు.. కొత్త అల్లుళ్లు.. ముత్యాల ముగ్గులే కాదు.. సినిమాల సందడి కూడా తప్పనిసరి. ఏ పండగ వచ్చినా సినిమాలు రిలీజ్ కావడం సాధారణమే. కానీ, సంక్రాంతి బరిలో దిగడమంటే హీరోలకు విపరీతమైన క్రేజ్. గట్టిగా చెప్పాలంటే ప్రజలకు కూడా సంక్రాంతి పండక్కి వచ్చే సినిమాలంటే ఒకరకమైన మోజు. అందుకే, సంక్రాంతి పండుగలో సందడి చేయడం కోసమే ఎక్కువ సినిమాలు రెడీ అయిపోతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు సినిమాలకు సంబంధించిన హడావుడి ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతికి ఒకేసారి ఏడెనిమిది సినిమాలు బరిలోకి దూకిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా వచ్చి హిట్లు కొట్టిన సినిమాలు కూడా ఎక్కువే. ఒకేరోజు విడుదలైన పెద్ద సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా సంక్రాతి సమయంలో గతంలో చాలానే ఉన్నాయి. కానీ, ఈ మధ్య ట్రెండ్ మారింది. హిట్ కొట్టడం కంటే.. కాసులు దండుకోవడమే ముఖ్యంగా సినిమాలు(Sankranti Movies) తయారు అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ ఎన్ని ఎక్కువ థియేటర్లలో ఉంటే, అంత సేఫ్ గా ఉంటామని నిర్మాతలు భావిస్తూ వస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలోనే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోవాలంటే సంక్రాంతిని మించిన సమయం ఉండదని వారి అంచనా. ఇప్పుడు ఈ థియేటర్ల పోటీ.. గందరగోళాన్ని రేపుతోంది. 

ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు(Sankranti Movies) తమ డేట్స్ ఎనౌన్స్ చేసుకున్నాయి. ఈ రేసులో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగా, ఈగిల్ రెడీ అని ఇప్పటికే చెప్పేశాయి. ఈ ఐదు సినిమాలు కూడా జనవరి 12, 13, 14 తేదీల్లో విడుదల కాబోతున్నాయి. దీంతో ధియేటర్ల సమస్య వచ్చిపడింది. ఈ ఐదు సినిమాలే కాకుండా, రెండు మూడు డబ్బింగ్ సినిమాలూ సంక్రాంతి టార్గెట్ గా రాబోతున్నట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. అంటే, దాదాపుగా ఏడెనిమిది సినిమాలకు థియేటర్లు.. షోలు సర్దుబాటు కావాలి. కానీ, అందుకు అవకాశమే లేదని అంటున్నారు దిల్ రాజు. స్ట్రెయిట్ సినిమాల్లో రెండు సినిమాలు వాయిదా వేయించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆయన అంటున్నారు. సంక్రాంతి కోసం ఐదు సినిమాలు పోటీలో ఉన్నాయి. వాటి నిర్మాతలతో మాట్లాడాం.. వాటిలో ఒకటి లేదా రెండు సినిమాలు వాయిదా వేసుకుంటే మంచిదని సూచించాం.. అలా వెనక్కి తగ్గిన వారికి తరువాత సోలోగా రిలీజ్ చేసుకునే విధంగా ఫిలిం ఛాంబర్ నుంచి అవకాశం ఇస్తామని దిల్ రాజు అంటున్నారు. 

ఎవరు పక్కకు తప్పుకుంటారు?

ఇప్పుడు ఇదే అతి పెద్ద ప్రశ్న. ఇప్పటివరకూ ఉన్న సమాచారం మేరకు ఈ ఐదుగురు నిర్మాతల్లో ఒక్కరు కూడా తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. మహేష్ బాబు గుంటూరు కారం సంక్రాంతిని బేస్ చేసుకునే నిర్మాణం జరుపుకుంది. పైగా పెద్ద సినిమా ముద్ర ఉంది. దీంతో ఈ సినిమా(Snkranti Movies) వెనక్కి వెళ్లే ఛాన్స్ అసలు కనిపించడం లేదు. ఇక విక్టరీ వెంకటేష్ సినిమా సైంధవ్ కూడా తగ్గేదే లే అనే పరిస్థితిలోనే ఉంది. ఎందుకంటే, ఈ సినిమాకి దగ్గుబాటి సురేష్ బ్యాంకింగ్ ఉంది. ఈ రెండు సినిమాలు ఎట్టిపరిస్థితిలోనూ వెనక్కి తగ్గవు అని చెప్పడానికి ఇంకో కారణం కూడా ఉందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. అది దిల్ రాజు ఈ రెండిటికీ మేజర్ పంపిణీదారుడిగా ఉన్నాడు. అందువల్ల రెండు సినిమాలు విడుదల ఆగే అవకాశం లేదనేది వారి విశ్లేషణ. 

Also Read: సలార్‌ కలెక్షన్ల ఊచకోత.. రూ. 400 కోట్లతో బాక్సాఫీస్‌ వద్ద ప్రభాస్‌ ప్రకంపనలు!

ఇక నాగార్జున నా సామి రంగ అంటూ సంక్రాంతి(Sankranti Movies) బరిలోకి వస్తున్నాడు. సినిమా మొదలు పెట్టడమే ఆలస్యంగా మొదలు పెట్టి సంక్రాతి టార్గెట్ అని చెప్పారు. ఇప్పుడు ఇంకా షూటింగ్ పెండింగ్ ఉందని వార్తలు వస్తున్నా.. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోంచి తప్పుకునే అవకాశాలు లేవు. ఇక మిగిలిన సినిమాలు హనుమాన్.. ఈగిల్. ఈగిల్ సినిమా రవితేజ హీరో. సంక్రాతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా ఎప్పుడూ తన సినిమా ఉంటూనే రావడం రివాజు. ఎప్పుడూ కూడా సంక్రాంతికి సినిమా ఎనౌన్స్ అయ్యాకా.. ఒక్కసారి కూడా రవితేజ సినిమా ఆగిన సందర్భాలు రాలేదు. దీంతో ఇప్పుడు హనుమాన్ సినిమా వాయిదా పడుతుందా? అని అందరూ చర్చించుకుంటున్నారు. చిన్న సినిమాగా అందరూ దానిని చూస్తున్నారు. దీంతో హనుమాన్ వెనక్కి తగ్గాలనే ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఈ కసరత్తంతా హనుమాన్ ఆగేలా చేయాలి అనే విశ్లేషకులు అంటున్నారు. సోలోగా వస్తే.. మంచిది అని హనుమాన్ కు అన్యాపదేశంగా చెబుతున్నారు అని వారంటున్నారు. మరోవైపు హనుమాన్ మేకర్స్ కూడా తమకు థియేటర్లు దొరికే పరిస్థితి లేకుండా చేస్తున్నారంటూ ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 

సోలో డేట్ సాధ్యమేనా?

ఇక్కడ ఇంకో అతి ముఖ్యమైన ప్రశ్న.. అసలు సోలో డేట్ అనేది సాధ్యమేనా? సంక్రాతి సందడి(Sankranti Movies) వదిలి ఎవరైనా పక్కకి జరిగితే తరువాత సోలోగా రిలీజ్ చేసుకునే అవకాశం ఇస్తామని దిల్ రాజు చెబుతున్నా.. అది సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే, ఇప్పటికే చాలా సినిమాలు డేట్స్ లాక్ చేసుకున్నాయి. జనవరి నెలాఖరు వరకూ కూడా రిలీజ్ కోసం చాలా సినిమాలు ముందుగానే డేట్స్ ఎనౌన్స్ చేసుకున్నాయి. మరి అలాంటప్పుడు వారు ఇప్పుడు ఒక సినిమా(Sankranti Movies) కోసం తమ డేట్ మార్చుకుని దరి ఇస్తారా? ఇది సాధ్యమయ్యే పనేనా అని టాలీవుడ్ లో అందరూ అనుకుంటున్నారు. 

మొత్తమ్మీద ఈ సంక్రాంతి పండుగ రాకుండానే సినిమా కోడి పుంజుల పంచాయతీ మొదలైంది. ఇక్కడ గెలిస్తేనే వెండి తెరపై సంక్రాంతికి బొమ్మ పడే అవకాశం ఉంది. ఈ పంచాయతీలో ఎవరు గెలుస్తారో.. సంక్రాంతి బరిలో దిగి ఎవరు నిలుస్తారో వేచి చూడాల్సిందే!

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు