సంజూశాంసన్.. ఫ్యాన్స్ దృష్టిలో ఇతను అత్యంత దురదృష్టకరమైన ఆటగాడు. టీమ్ సెలక్షన్ జరిగిన ప్రతీసారి సంజూశాంసన్ పేరు కనపడదని.. సెలక్షర్లు పక్షపాతం చూపిస్తారన్న ఆరోపణలు ఏనాటి నుంచో ఉన్నాయి. ఫ్యాన్స్ వాదనకు తగ్గట్టుగానే శాంసన్ కాకుండా సెలక్ట్ అయిన ఆటగాడు ఫెయిల్ అవుతుంటాడు. వన్డే వరల్డ్‌కప్‌కి శాంసన్‌ని కాకుండా సూర్యకుమార్ యాదవ్‌ని సెలక్ట్ చేయడం పట్ల ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు. వన్డేల్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న సంజూశాంసన్‌ని కాకుండా రెండేళ్లుగా 50 ఓవర్ ఫార్మెట్‌లో అట్టర్‌ఫ్లాప్ అవుతున్న సూర్యని ఎంపిక చేయగా.. అతను ప్రపంచకప్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఫైనల్‌లో ఘోరమైన ఆటతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సంజూను సెలక్ట్ చేశారు. తాజాగా జరిగిన వన్డే సిరీస్‌లో సంజూ రాణించాడు. అందరి నోళ్లు మూయించాడు.
సెంచరీతో అదరహో:
దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు సంజూ. 1-1తో సిరీస్ సమం అవ్వగా.. నిర్ణయాత్మక మూడో వన్డేల్లో సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. చెత్త బంతులను బౌండరీకు తరలిస్తూ స్లో అండ్ స్టడీ హండ్రెడ్ బాదాడు. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్ ఆరంభంలో తడబడినా సంజూ శాంసన్ (114 బంతుల్లో 108; 6ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి సెంచరీని అద్భుతంగా ఆడాడు. సంజూ బ్యాటింగ్‌పై సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఈ సెంచరీ సంజూ కెరీర్‌ని మార్చేస్తుందని అభిప్రాయపడ్డాడు. సంజూ శాంసన్‌లో ఈ ప్రతిభ ఇప్పటికే ఉందని, దానిని అతను అందించలేదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
'అతడి(సంజూశాంసన్)లో ఎంత టాలెంట్ ఉందో మనందరికీ తెలిసిందే' అని కామెంట్ చేశాడు.
అటు సెంచరీపై సంజూ శాంసన్ ఎమోషనల్ అయ్యాడు. 'నేను ఎమోషనల్‌గా ఉన్నాను. నేను శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడుతున్నాను. ఇప్పుడు ఫలితాలు నాకు అనుకూలంగా రావడం చూసి నేను సంతోషిస్తున్నాను.'
సంజూ 14 ఇన్నింగ్స్‌లలో 56.67 సగటు, 99.61 స్ట్రైక్ రేట్‌తో 510 పరుగులు చేశాడు. వన్డేల్లో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. సంజూ భారత్ తరఫున అత్యధిక సార్లు ఐదు, ఆరవ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగాడు.
Also Read: ట్రిగ్గర్ చేస్తే రెచ్చిపోవద్దు.. సచిన్, ద్రవిడ్‌ని చూసి నేర్చుకోండి..!
WATCH: