ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది. రాజ్యసభ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ ప్రకటించారు. మణిపూర్ హింసాకాండపై ఈ రోజు కూడా సభలో రసాభాస చోటు చేసుకుంది. ఆ సమయంలో వెల్ లోకి దూసుకు వెళ్లి రభస చేశారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ నుంచి సంజయ్‌ను సస్పెండ్ చేయాలని హౌజ్ లీడర్ పీయూష్ గోయల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానానికి చైర్మెన్ జగదీప్ ధన్ ఖర్ ఓకే చెప్పారు. అంతకు ముందు మధ్యాహ్నం 12 గంటల తర్వాత సభ పున: ప్రారంభం అయిన తర్వాత చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ సభలో ప్రశ్నోత్తరాల సమాయం అనుమతిచ్చారు. ఇంతలో విపక్షాలు సభకు అడ్డు తగిలాయి.
విపక్ష సభ్యుల్లో చాలా మంది 267 నిబంధన ప్రకారం మణిపూర్ హింసా కాండపై సుదీర్ఘ చర్చకు అనుమతించాలని నోటీసులు ఇచ్చామని గుర్తు చేశారు. అందువల్ల చర్చకు అనుమతించాలని, మణిపూర్ పరిస్థితులపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందర గోళం మొదలైంది. కానీ ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించాలని చైర్మన్ సూచించారు.
ఈ క్రమంలో జల శక్తి మంత్రి గజేంద్ర షకావత్ తన మంత్రిత్వ శాఖకు సంబంధించి వచ్చిన ప్రశ్నలకు సమధానం ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్ లోకి దూసుకు వచ్చారు. అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంజయ్ సింగ్ ను ఆయన సీట్లోకి వెళ్లి పోవాలని చైర్మన్ సూచించారు. కానీ చైర్మన్ మాటలను ఎంపీ వినిపించుకోలేదు. దీనిపై చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సభలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని హౌజ్ లీడర్ పీయూష్ గోయెల్ అన్నారు. ఆ మేరకు సంజయ్ సింగ్ ను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశ పెట్టారు.