జాతీయ రాజకీయాలు మొదలుపెట్టాక.. కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టిన రాష్ట్రం మహారాష్ట్ర. వరుసగా బహిరంగ సభలు, టూర్లతో పార్టీని అక్కడ విస్తరించే పనిలో ఉన్నారు. తాజాగా కూడా రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఓవైపు ఆధ్యాత్మికంగా ఆలయాల సందర్శన చేస్తూనే.. ఇంకోవైపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే.. కేసీఆర్ పదేపదే మహారాష్ట్ర పర్యటనకు వస్తుండడంపై ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన సీరియస్ గానే స్పందించింది.
మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఏమాత్రం ఉండదన్న ఎంపీ సంజయ్ రౌత్.. 12 నుంచి 13 మంది బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారని వ్యాఖ్యానించారు. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు మాత్రమేనని.. బీఆర్ఎస్, బీజేపీకి బీ టీమ్ గా మారిందని విమర్శలు గుప్పించారు. బీజేపీనే కేసీఆర్ ను మహారాష్ట్రకు పంపినట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ బలంగా ఉందని స్పష్టంచేశారు సంజయ్ రౌత్.
గత ఎన్నికల సమయంలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి మహా వికాస్ అఘాడీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఫామ్ చేశాయి. ఉద్ధవ్ థాక్రే సీఎం అయ్యారు. అయితే.. శివసేన రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఉద్ధవ్ సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనూహ్యంగా శివసేన రెండో వర్గం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగిస్తోంది. షిండేను సీఎం చేసి బీజేపీ డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకుంది. అయితే.. ఇదంతా ముమ్మాటికీ బీజేపీ కుట్రేనని ఉద్ధవ్ వర్గం ఆరోపిస్తూ వస్తోంది.
బీజేపీ, ఉద్ధవ్ శివసేన వర్గం మధ్య యుద్ధం సాగుతుండగా.. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో విస్తరించే పనిలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు మహారాష్ట్రను నాశనం చేశాయని విమర్శలు గుప్పిస్తున్నారు. పుష్కలంగా నీళ్లు ఉన్నా ప్రజలకు అందడం లేదని.. తెలంగాణ మోడల్ ను అక్కడి ప్రజలకు వివరిస్తున్నారు. అయితే.. కేసీఆర్ వెనుక కూడా బీజేపీ ఉందనేది ఉద్ధవ్ శివసేన రెండో వర్గం వాదన. బీఆర్ఎస్ శ్రేణులు దీన్ని కొట్టిపారేస్తున్నారు.