Salaar Review: ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే సలార్.. ప్రభాస్ హిట్ కొట్టాడా? చాలాకాలం నుంచి ప్రపంచ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ థియేటర్లలో వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ అభిమానులను అలరిస్తోంది. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. పూర్తి రివ్యూ కోసం హెడింగ్ పై క్లిక్ చేయండి. By KVD Varma 22 Dec 2023 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Salaar Movie Review in Telugu: కొన్ని సినిమాలు కథ కోసం చూస్తాం.. మరికొన్ని హీరో కోసం చూస్తాం. కథతో సంబంధం లేకుండా హీరో కోసమే చూసే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాల్లో ప్రభాస్ సినిమాలు మొదటి వరుసలో ఉంటాయి. సినిమా ఎలా ఉందనేది సెకండరీ.. మొదట ప్రభాస్ (Prabhas) సినిమా అంతే. అభిమానులకే కాదు.. ప్రేక్షకులందరిదీ దాదాపుగా ఇదే ధోరణి. ప్రభాస్ సినిమా అంటే మొన్నటివరకూ తెలుగు రాష్ట్రాల్లోనే ఆ పరిస్థితి ఉండేది. కానీ, బాహుబలి తరువాత ఆ ధోరణి ప్రపంచవ్యాప్తం అయింది. ఇప్పుడు ప్రభాస్ సలార్ గా ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి బాహుబలి (Baahubali) తరువాత ప్రభాస్ కి హిట్ లేదు. అంటే.. అందరికీ నచ్చేలా ప్రభాస్ ని చూపించిన సినిమా లేదు. కొంత వరకూ సాహో ఫర్వాలేదు అనిపించినా.. రాధేశ్యామ్.. ఆదిపురుష్ సినిమాలు పూర్తిగా నిరాశపరిచాయి. కథ, కథనాల పరంగానే కాకుండా ప్రభాస్ లుక్స్ పరంగా కూడా ఈ సినిమాలు అందరినీ పూర్తిగా నిరాశపరిచాయి. పరోపక్క ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ (KGF) సినిమా రెండు పార్టులతో టాప్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు. ఆ రెండు హిట్స్ తరువాత ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా అనేసరికి ఎక్స్ పెక్టేషన్స్ ఒక రేంజ్ లో వచ్చేశాయి. సినిమా ట్రైలర్స్.. సింగిల్స్ దానిని మరో లెవెల్ కి తీసుకుపోయాయి. ఎంత అంటే.. సినిమా రిలీజ్ కంటే ముందే మొదటి రోజు ఒక్కరోజే కోట్లాది రూపాయలు కొల్లగొట్టి రికార్డులు సృష్టించేంతగా. మరి సలార్(Salaar Review) అందరినీ మెప్పించాడా? గత సినిమాల స్థాయిలో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దీనిని నిలబెట్టాడా? తెలుసుకుందాం. అనగనగా అంటూ చెప్పే చందమామ కథల రోజులు కావివి. న్యూ ఏజ్ సినిమాలు.. కొత్త తరం దర్శకుల స్పీడ్ కథనాల కాలం ఇది. కథ కంటే.. కథనం.. ఎలివేషన్స్.. ఫొటోగ్రఫీ.. పబ్లిసిటీ ఇప్పుడు మొదటి ప్రాధాన్యం. చందమామ కథల్లో రాజులు.. రాజ్యాలు.. రాజ్యం కోసం యుద్ధాలు.. యుద్ధ తంత్రాలు.. ఉండేవి. ఇప్పటి కథల్లో మాఫియా సామ్రాజ్యాలు.. పెన్నుల్లా వాడే గన్నులు.. విజువల్ ఎఫెక్ట్స్.. అక్కడక్కడ ఆమ్మో.. అక్కో.. స్నేహితుడో రెండు సెంటిమెంట్ సీన్స్ మెయిన్. పెద్ద హీరోల సినిమాల్లో ఇవే ముఖ్యం. వీటికి హీరో ఎలివేషన్స్ కూడా ఉండాలి. ఈ మూసలో కరెక్ట్ గా సరిపోయింది సలార్ . శతాబ్దాల క్రితం నుంచి ప్రపంచంతో సంబంధం లేని రాజ్యం.. కొల్లగొట్టి.. ప్రపంచమంతా అరాచకాల నిప్పులు వెదజల్లే అతి పెద్ద సామ్రాజ్యం. సామ్రాజ్యం అంటే దానికో సింహాసనం.. అది ఉన్నాకా ఒక కింగ్. కింగ్ అవ్వాలని.. సింహాసనం దక్కించుకోవాలని చూసే మంది. ఇది సహజం కదా. సలార్ సినిమా కూడా అంతే.. ఇక్కడ చీకటి సామ్రాజ్యానికి కింగ్ కావడానికి ఒక లీడర్ చేసిన దుస్సాహసం.. ఆ లీడర్ ను తప్పించడం కోసం ఎవరికి వారు ఎత్తులు వేసే కొంతమంది చిన్న లీడర్స్.. వారి మధ్యలో ఆ కింగ్ డమ్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నించే కింగ్ రెండో భార్య కొడుకు.. ఆ కొడుకు కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధపడే సలార్.. ఇది కథ.. ట్విస్ట్ ఏమిటంటే.. తన స్నేహితుని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే సలార్ ప్రాణస్నేహితునికి శత్రువుగా మారిపోతాడు. అది ఎందుకు? అసలు ఆ చీకటి సామ్రాజ్యానికి కింగ్ కావాలనే ప్రయత్నం చేసిన వారందరూ ఏమయ్యారు? ఈ ప్రశ్నలకు సమాధానం సలార్! ఇది ఇంకా అయిపోలేదు.. మరో పార్ట్ కూడా ఉంది. దానికి లీడ్ కూడా సినిమాలో ఇచ్చారు. డార్లింగ్ ప్రభాస్ గురించి ముందుగా చెప్పుకోవాలి. సినిమా లో ప్రభాస్ అభిమానులకు కన్నుల పండగ చేశాడు. ప్రతి సీన్.. ప్రతి మూమెంట్.. తనదైన స్టైల్ లో చిన్న చిన్న డైలాగ్స్.. అన్నీ చాలాకాలం తరువాత మళ్ళీ ప్రభాస్ నుంచి కనిపించాయి. సెంటిమెంట్ సీన్స్ లో ప్రభాస్ అదరగొట్టేశాడు. అమ్మ మాటకు కట్టుబడి ఉండే కొడుకుగా.. స్నేహితుడి మాట జవదాటని స్నేహితుడిగా.. సెంటిమెంట్ సీన్స్ లో మెస్మరైజ్ చేసిన ప్రభాస్.. యాక్షన్ సీన్స్ లో తాను తప్ప ఎవ్వరూ ఇవ్వలేని స్పెషల్ ఫీచర్స్ తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ కి తీసుకువెళ్లాడు. ఇక ప్రభాస్ స్నేహితునిగా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రతి ఫ్రేమ్ లోనూ ప్రభాస్ తో నువ్వా.. నేనా అన్నట్టు కనిపించాడు. దీంతో ప్రభాస్ పాత్ర కూడా బాగా ఎలివేట్ అయింది. వీరిద్దరూ కలిసి చేసిన ఫైట్ అయితే.. గూస్ బంప్స్ తెప్పించేదిగా ఉంది. పవర్ ఫుల్ క్యారెక్టర్ లో జగపతి బాబు అదరగొట్టాడు. శ్రియా రెడ్డి పాత్రలోని ఎలివేషన్ సీన్స్ బావున్నాయి. ఝాన్సీ కూడా సపోర్టింగ్ గా బాగా కుదిరింది. ఇక నటి ఈశ్వరీ రావుకి చాలా మంచి పాత్ర దొరికింది. ప్రభాస్ అమ్మగా ఆమె అలరించింది. ఇక హీరోయిన్ గా శృతి హాసన్ (Shruti Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉంది అంటే ఉంది. ఉన్నంత వరకూ బాగానే ఉంది. Also Read: కార్లంటే ఇష్టం అన్నా అంతే లాంబోర్గిని ఇచ్చేశాడు.. ప్రభాస్ గురించి చెప్పిన పృథ్వీరాజ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఎప్పుడూ ఉన్నట్టే బోలెడు క్యారెక్టర్స్. వాటన్నిటి మధ్య హీరో ఎలివేషన్.. సీన్ బై సీన్ తెరకెక్కించిన విధానం.. అన్నిటినీ మించి ప్రభాస్ ను అభిమానుల కోసం మరో లెవెల్ లో చూపిస్తూనే కథనాన్ని నడిపించిన పధ్ధతి అన్నీ బావున్నాయి. అయితే, ఎక్కువగా ప్రభాస్ మీద దృష్టి పెట్టినట్లు కనిపించింది. కొన్ని సీన్స్ అలాగే కనిపించాయి. ఇద్దరు స్నేహితుల మధ్య కథగా మొదలు పెట్టిన సినిమాలో(Salaar Review) చిన్నతనంలో ఆ రెండు క్యారెక్టర్స్ మధ్య కనిపించిన డెప్త్.. పెద్దగా మారాకా కనిపించలేదు. ప్రభాస్.. పృథ్వి మధ్య స్నేహాన్ని ఎలివేట్ చేసే సీన్స్ లేకపోవడం మైనస్. టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో రవి బస్రూర్ (Ravi Basrur) సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత ఊపు ఇచ్చింది. ప్రభాస్ ఎలివేషన్స్ నుంచి ఫైట్స్ వరకూ ప్రతి సన్నివేశంలోనూ కెమెరా గొప్పతనం కనిపించింది. అంతేకాదు.. కొన్ని షాట్స్ అయితే.. ఆ సీన్స్ ని మరింత గొప్పగా తీర్చిదిద్దాయి.. ఇక ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాగానే ఉంది కానీ.. మరీ ఎక్కువ కట్ షాట్స్ కనిపించాయి. ఒక్కోసందర్భంలో ఈ కట్ షాట్స్ కన్ఫ్యూజ్ కూడా చేశాయి. మొత్తంగా చూసుకుంటే.. యాక్షన్ సినిమాలు మెచ్చేవారికి సలార్ నచ్చుతుంది. అలాంటి వారు ప్రభాస్ ఫాన్స్ అయితే ఇంకా నచ్చుతుంది. సాధారణంగా సినిమా చూసేవారికి సినిమా బాగానే ఉందనిపిస్తుంది. యాక్షన్ కాకుండా ఇంకా ఏమన్నా కావాలంటే మాత్రం.. కొంచెం కష్టమే. చివరగా ఓ మాట.. ప్రభాస్ బాహుబలి గా సలార్లో ఆధునికంగా కనిపించాడు.. మెప్పించాడు. సరే.. అసలు ప్రభాస్ లోని 'డార్లింగ్' ని మళ్ళీ చూపించే కథలు లేవా? దర్శకులు లేరా? ఉన్నా అలాంటి సినిమాలు తీసే నిర్మాతలు లేరా? చిన్న డౌటనుమానం అంతే! - KVD వర్మ Watch this Interesting Video: #salaar-movie #prabhas-salaar-movie #prabhas-salaar-movie-review #salaar-review-in-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి