బ్రో సినిమా ప్రచారంలో భాగంగా ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు సాయిధరమ్ తేజ్. తన మేనమామతో పాటు, చిరంజీవి నటించిన సినిమాలేవీ తను రీమేక్ చేయనని స్పష్టం చేశాడు. అయితే ప్రేక్షకులు, మామలు బలవంతం చేస్తే మాత్రం తొలిప్రేమ సినిమాను రీమేక్ చేస్తానని ప్రకటించాడు.
“సాధారణంగా నేను రీమేక్స్ చేయాలని అనుకోను. వాళ్ల బాడీ లాంగ్వేజ్ ను మ్యాచ్ చేయడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ సినిమాలు అస్సలు రీమేక్ చేయను. ఎందుకంటే, ఫ్యాన్స్ అంచనాలు చాలా ఉంటాయి. వాటిని అందుకోవడం కష్టం. ఇక తప్పదు, చేయాల్సిందే, తలపై గన్ పెట్టి అడిగితే మాత్రం తొలిప్రేమ సినిమాను రీమేక్ చేస్తాను.”
ఇలా మెగా రీమేక్స్ పై స్పందించాడు సాయితేజ్. బ్రో సినిమా ప్రచారంలో భాగంగా పీపుల్ టెక్ కంపెనీని సందర్శించాడు సాయితేజ్. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కు చెందిన ఈ సాఫ్ట్ వేర్ సంస్థలో, ఉద్యోగులతో సరదాగా మాట్లాడాడు.
ఈ సందర్భంగా పవన్ తో తనుకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు సాయితేజ్. తెరపై తనది, పవన్ ది బాండింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని, తప్పకుండా ప్రేక్షకులు ఆ బాండింగ్ ను ఇష్టపడతారని అంటున్నాడు. తమ కాంబినేషన్ కోసమే బ్రో సినిమా చూడాలని, అదే మెయిన్ ఎట్రాక్షన్ అని చెబుతున్నాడు.