పంజాబ్.. నంగల్‌లోని మొహల్లా పురాణ గురుద్వారా ప్రాంతంలో, బాత్‌రూమ్‌లో నీళ్లతో ఆడుకుంటూ బకెట్‌లో మునిగి, ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. అప్పుడప్పుడే నడవడం నేర్చుకుంటున్న ఆ చిన్నారి.. ఇంటి హాల్ నుంచి బాత్‌రూంలోకి వెళ్లాడు. ఎండ వేడి నుంచి ఉపశమనం లాగా… అక్కడి బకెట్‌లో నీళ్లు చిన్నారికి నచ్చాయి. వాటితో ఆడుకుంటూ.. బకెట్‌లో దిగేందుకు ప్రయత్నించాడు. బకెట్ నిండా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లలో పడి, మునిగి మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు వెంటనే తెలియలేదు.
కొంతసేపటి తర్వాత ఇంట్లోని మరో పాప.. బకెట్‌లో చిన్నారి కాళ్లు పైకి ఉండటం చూసింది. అదేంటి అనుకుంటూ.. దగ్గరకు వెళ్లింది. చిన్నారి తల చేతులూ.. బకెట్ లోపల ఉన్నాయి. పైకి కాళ్లు ఉన్నాయి. షాకైన ఆ పాప.. పరుగున వెళ్లి.. వంటగదిలో వాళ్లకు చెప్పింది. అందరూ పరుగున వచ్చి చూశారు.
హడావుడిగా చిన్నారిని బయటకు తీశారు. అయ్యో అయ్యో అనుకుంటూ.. రకరకాలుగా కదిలించేందుకు ప్రయత్నించారు. ఏం చేసినా చిన్నారిలో ఉలుకూ పలుకూ లేదు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు చిన్నారిని పరీక్షించి.. అప్పటికే చనిపోయాడని చెప్పారు. దాంతో.. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉంటే, ఇలా అయ్యేది కాదే.. అనుకుంటూ.. కన్నీరు పెట్టారు.ఇలాంటి ఘటనలు చాలా ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. పిల్లలు ఎక్కడా కుదురుగా ఉండరు. వాళ్లకు ప్రతీదీ తెలుసుకోవాలనే తపన, తాపత్రయం ఉంటాయి. అందువల్ల వాళ్లు అటూ ఇటూ వెళ్లిపోతూ ఉంటారు. వాళ్లకు చుట్టుపక్కల ఏదీ ప్రమాదకరమైనవి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా నీరు, కత్తి, కరెంటు షాక్ కొట్టే ఎలక్ట్రిక్ పరికరాలు, నోట్లో మింగేందుకు వీలుగా ఉండేవి.. దగ్గర్లో లేకుండా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.