మనల్ని వదిలి వెళ్లినా.. గద్దరన్న మన మధ్యలోనే ఉన్నాడనే అనుభూతి.. గద్దరన్న రాసి, పాడిన పాటలు వింటుంటే.. మా కోసం మళ్లీ పుట్టుకొచ్చాడనే అనిపించింది. ఆట పాటలతో 6 గంటల పాటు ఆ హాలంతా హోరెత్తుతుంటే.. గద్దరన్న మన మధ్యలోనే ఉన్నాడు.. ఎవరు చెప్పారు చనిపోయాడనిపించేలా సాగింది హైదరాబాద్‌లో ఆర్టీవీ, తొలివెలుగు సంయుక్తంగా నిర్వహించిన గద్దర్ సంస్మరణ సభ. ఐదున్నర దశాబ్ధాలకు పైగా తన ఆట, పాటలతో ఎంతోమందిని చైతన్యవంతులను చేసిన ప్రజా కవి గద్దర్ ఆకస్మిక మరణం అందరినీ ఎంతగానో కలిచివేసింది. నిన్నటి వరకు తన ఆట, పాటలతో అలరించిన గద్దర్‌కు ఘన నివాళులర్పించింది ఆర్టీవీ, తొలివెలుగు. కవులు, రచయితలు, ఉద్యమకారులు ఇలా ఎందరినో ఒక చోటకు చేర్చి.. గద్దరన్నతో వారందరి అనుబంధాలను సమాజానికి తెలిపే ప్రయత్నం చేసింది ఆర్టీవి, తొలివెలుగు.
గద్దర్‌తో కలిసి అడుగులేసిన ఎందరో కళాకారులు, గాయకులు, కవులు, రాజకీయ ప్రముఖులు సంస్మరణ సభలో పాల్గొన్ని.. గద్దర్‌తో తమ అనుభవాలు, అనుభూతులను గుర్తు చేసుకున్నారు. ఉద్యమ సహచరిణి విమలక్క, గోరటి వెంకన్న, ఆర్ నారాయణమూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరామ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, అద్దంకి దయాకర్, ఏపూరి సోమన్న, జయరాజ్, మానుకొట ప్రసాద్, గెడ్డం సతీష్, పుష్పక్క.. ఇలా ఒకరేంటి.. ఆయనతో పరిచయం ఉన్న కళాకారులంతా ఒకే చోటకు చేరి.. ఆట పాటలతో గద్దర్‌రు నివాళులర్పించారు.
ప్రజాకవి గద్దర్‌ను స్మరిస్తూ ఏపూరి సోమన్న పాడిన పాటకు.. గోరటి వెంకన్న ఆడుతూ అందరినీ అలరించారు. దోపిడీ రాజ్యం పోవాలని, పేదల బతుకుల్లో వెలుగులు నిండాలని జీవితాంతం పోరాటం చేసిన యోధుడు గద్దర్‌ను సమాజం కోల్పోయిందంటూ బాధాతప్త హృదయాలతో శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్ ఓ సామాన్య వ్యక్తి కాదు.. సమాజాన్ని కదిలించిన ఓ శక్తి.. ఆయన పాట వింటుంటే ఒళ్లు పులకరించిపోవల్సిందేనంటూ ప్రతి ఒక్కరూ తమ అనుభూతులను చెప్పుకొచ్చారు. అవతలివాడు ఎంతటివాడైనా.. ఎదురొడ్డి నిలబడి.. అణగారిన వర్గాల బతుకులు బాగుపడటం కోసం పరితపించిన యోధుడంటూ గద్దర్ గొప్పతనాన్ని చెబుతూఉంటే.. ఎంత గొప్ప మనిషిని ఈ సమాజం కోల్పోయిందంటూ ప్రతి ఒక్కరూ తమ బాధను వెల్లగక్కారు. గద్దర్ భౌతికంగా లేకపోయినా.. ఆయన మాట, ఆట, పాట, ఆశయం మనతోనే శాశ్వతంగా ఉంటుందంటూ.. నివాళులర్పించారు.
గద్దర్ ఆశయం నెరవేరేవరకు.. కళాకారులంతా పోరాడాలి వక్తలు పిలుపునిచ్చారు. ప్రజా యుద్ధ నౌక ఇచ్చిన స్ఫూర్తి కలకాలం నిలిచే ఉంటుందని, ఆయన ఆశయాలు కొనసాగించడమే గద్దర్‌కు అర్పించే నిజమైన నివాళులని చెప్పారు. గద్దర్ మన మధ్య లేకపోయినా.. ఆయన పాటలను తికించాలని.. అందుకోసం ఓ పాటల మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని కళాకారులు ప్రతిపాదించారు. కార్యక్రమం కొనసాగుతున్నంతసేపు గద్దర్ మనమధ్యలోనే ఉండి ఆస్వాదిస్తున్నాడనే అనుభూతి కలిగింది. గద్దర్ వెళ్తూ వెళ్తూ.. ఎంత మంది గద్దర్‌లను తయారుచేశాడో.. ఆర్టీవీ సంస్మరణ సభ ద్వారా ప్రజల కళ్లకు కట్టినట్లు కనిపించింది. ప్రతి ఒక్కరూ జోహర్ గద్దరన్న అని నినదిస్తూ.. ఆ ప్రజాకవికి ఘన నివాళులర్పించారు.
ప్రజా యుద్ధ నౌకకు ఆట, పాటలతో.. RTV ఘన నివాళి..!
హైదరాబాద్‌లో ఆర్టీవీ, తొలివెలుగు సంయుక్తంగా నిర్వహించిన గద్దర్ సంస్మరణ సభ ఆయన ప్రజలకు అందించిన జ్ఞాపకాలను, ఆటపాటలను గుర్తుకు తెచ్చింది. గద్దర్‌తో కలిసి అడుగులేసిన ఎందరో కళాకారులు, గాయకులు, కవులు, రాజకీయ ప్రముఖులు సంస్మరణ సభలో పాల్గొన్ని.. గద్దర్‌తో తమ అనుభవాలు, అనుభూతులను గుర్తు చేసుకున్నారు. గద్దర్ వెళ్తూ వెళ్తూ.. ఎంత మంది గద్దర్‌లను తయారుచేశాడో.. ఆర్టీవీ సంస్మరణ సభ ద్వారా ప్రజల కళ్లకు కట్టినట్లు కనిపించింది. ప్రతి ఒక్కరూ జోహర్ గద్దరన్న అని నినదిస్తూ.. ఆ ప్రజాకవికి ఘన నివాళులర్పించారు.