భారతీయులంతా హిందువులే..
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( RSS )చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి మన దేశాన్ని ఇండియాకు బదులు భారత్ అని పిలవాలని ఆయన సూచించారు. భారతదేశం అనే పేరు ప్రాచీనకాలం నుంచి ప్రచారంలో ఉందని.. దేశ ప్రజలు భారత్ అనే పిలుపును అలవాటు చేసుకోవాలని కోరారు. నాగపూర్, గౌహతిలో జరిగిన సకల్ జైన సమాజ్ కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ శతాబ్దాలుగా మన దేశం పేరు భారత్ అనే ఉందని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశం పేరు ఒకేలా ఉంటుందని.. కానీ మన దేశంలో మాత్రం వివిధ భాషల్లో వివిధ పేర్లు ఉన్నాయని గుర్తు చేశారు. అందుకే ఇండియా పేరు బదులు భారత్‌ని ఉపయోగించాలని.. అప్పుడే ఈ మార్పు జరుగుతుందని ఆయన వెల్లడించారు. మన దేశంలో ఉన్నవారందరినీ తెలియజేసే పదమే హిందూ అని.. భారతీయులంతా హిందువులేనని వివరించారు.
స్వార్థంతో అమలు చేయట్లేదు..
ప్రస్తుతం భారతదేశంలో ఉన్నవారంతా హిందూ సంస్కృతికి, హిందూ పూర్వీకులకు చెందిన వారేనన్నారు. ఈ విషయాన్ని కొందరు అర్థం చేసుకున్నా.. వారి అలవాట్లు, స్వార్థపరత్వం కారణంగా అమలు చేయట్లేదన్నారు. మరికొందరు అయితే ఇంకా దీనిని అర్థం చేసుకోలేదని ఆయన తెలిపారు. స్వదేశీ కుటుంబ విలువలు, క్రమశిక్షణపై సమష్టిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భారతదేశం అందరినీ ఏకం చేసే దేశమన్నారు.
భారత్ లేకుండా ప్రపంచం నడవదు..
ప్రస్తుతం ప్రపంచానికి భారతీయుల అవసరం ఉందని.. భారత్ లేకుండా లేకుండా ప్రపంచం నడవదని పేర్కొన్నారు. యోగా ద్వారా ప్రపంచాన్ని అనుసంధానం చేశామని గుర్తు చేశారు. భారతీయ విద్యావ్యవస్థను బ్రిటిష్ వారు మార్చివేశారని.. కొత్త విద్యావిధానం పిల్లల్లో దేశభక్తిని పెంచే ప్రయత్నం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలపై అవగాహన కల్పించాలని భగవత్ కోరారు.