RRR wins six National Film Awards: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన త్రిబుల్ ఆర్ చిత్రం జాతీయ అవార్డుల్లోనూ తన సత్తాను చాటింది. మొత్తం ఆరు అవార్డులు ఈ సినిమాకు లభించాయి. ఆస్కార్ బరిలో మెరిసిన ఈ చిత్రానికి, జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు దక్కింది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో కీరవాణికి జాతీయ అవార్డ్ దక్కింది. ఇక ఇదే సినిమాలో కొమరం భీముడో అనే సాంగ్ పాడిన కాలభైరవకు ఉత్తమ గాయకుడిగా నేషనల్ అవార్డ్ వచ్చింది. వీటితో పాటు జాతీయ స్థాయిలో బెస్ట్ పాపులర్ ఫిలింగా కూడా నిలిచింది ఆర్ఆర్ఆర్.
ఆర్ఆర్ఆర్ లో ఫైట్స్ కంపోజ్ చేసిన కింగ్ సోలమన్ కు బెస్ట్ స్టంట్ డైరక్టర్ గా అవార్డ్ దక్కింది. ఇక బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ కు, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో శ్రీనివాసమోహన్ కు జాతీయ అవార్డులు వరించాయి.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. దాదాపు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాను, ఇప్పటికే ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ చిత్రంలో విశేషాలను ఒక సారి చూద్దాం.
నాటు నాటు.. సూపర్ హిట్
''నాటు నాటు నాటు నాటు
నాటు వీర నాటు.."
ఈ గీతం ప్రపంచవేదికలపైన మార్మోగింది. త్రిబుల్ ఆర్ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసికెళ్లింది. చంద్రబోస్, కీరవాణి లకు అవార్డులు లభించాయి.
పొలంగట్టు దమ్ములోన.. పోట్లగిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో.. పోతరాజు ఊగినట్టు
కిర్రుసెప్పులు ఏసుకుని.. కర్రసాము చేసినట్టు
మర్రిసెట్టు నీడలోన.. కుర్రగుంపు కూడినట్టు
యెర్రజొన్న రొట్టెలోన.. మిరపతొక్కు కలిపినట్టు
ఈ పాటకు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన నృత్యం కూడా ఆకట్టుకుంది.
నిప్పులు కురిపించిన సంభాషణలు
ఈ చిత్రాలు సంభాషణలు కూడా పదునుగా సాగాయి. ఒక్కసారి వీటిని చూడండి.
ఆడుకనబడితే నిప్పుకణం నిలబడినట్టు ఉంటది..
కలబడితే యేగు చుక్క ఎగబడినట్టు ఉంటది..
ఎదురుపడితే చావుకైనా చెమట ధారకడతది..
బాణమైనా, బందూక్ అయినా వానికి బాంచనైతది..
ఇంటిపేరు అల్లూరి, సోకింది గోదారి, నా అన్న మన్యం దొర
అల్లారి సీతారామరాజు
ప్రాణం కన్నా విలువైనది
నీ సోపతి నా సొంతం అన్నా
గర్వంతో ఈ మన్నులో కలిసిపోతానే
తొంగి తొంగి, నక్కినక్కిగాదె
తొక్కుకుంటూ పోవాలె..
ఎదురొచ్చినా వాడిని ఏసుకుంటూ పోవాలె
నువ్వు చేసేది ధర్మయుద్ధమయితే,
ఆ యుద్ధాన్ని వెతుక్కంటూ ఆయుధాలు
వాటంతట అవే వస్తాయి..
భీమ్..
ఈ నక్కలవేట ఎంత సేపు?
కుంభస్థలాన్ని బద్దలు కొడదా పదా?
నేను మల్లి కోసం వస్తే..
అన్న మట్టి కోసం వచ్చిండు..
జాతీయ అవార్డుల ప్రకటనతో ఇందులో భాగస్వాములయిన వారంతా తమ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.