ఉత్తర్ ప్రదేశ్ (UP) రాజధాని లఖ్‌నవూ(Lucknow) లో ఘోరం జరిగింది. ఆలంబాగ్ లో ఓల్డ్ రైల్వే కాలనీ (Railway colony)లో ఇంటి కప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రమాదంలో చనిపోయిన వారిని రైల్వే ఉద్యోగి సతీశ్ చంద్ర, ఆయన్ భార్య సరోజినీ దేవి, పిల్లలు హర్షిత, హర్షిత్, అన్ష్ లుగా గుర్తించారు. అధికారులు శిథిలాల కింద నుంచి సతీశ్ కుటుంబ సభ్యులను బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే వారు అందరూ కూడా మరణించినట్లు వైద్యులు తెలిపారు.
సతీశ్ చంద్రకు ఇటీవలే తల్లి చనిపోయింది. ఆమె ఉద్యోగమే సతీశ్ చంద్రకు వచ్చింది. కొద్ది రోజుల క్రితమే ఆయన ఉద్యోగంలో చేరాడు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న యూపీ సీఎం యోగి స్పందించారు. మృతి చెందిన వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
చనిపోయిన వారు ఉంటున్న ఇల్లు చాలా పాతది కావడంతో పాటు..ఇటీవల కొద్ది రోజులుగా ఆగకుండా వర్షాలు పడుతుండంతో ఇంటి పైకప్పు కూలిపోయి ఈ దారుణం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.