146ఏళ్ల టెస్టు చరిత్రలో నయా రికార్డు..
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్‌శర్మ(Rohit Sharma) టెస్టుల్లో నయా రికార్డు నమోదుచేశాడు. వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న సిరీస్‌లో మంచి ఫాంలో ఉన్న రోహిత్ రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. దీంతో 146 ఏళ్ల టెస్టు చరిత్రలో అత్యధిక సార్లు డబుల్ డిజిట్ స్కోర్లు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేల జయవర్ధనే రికార్డును బ్రేక్ చేశాడు.
మహేల జయవర్ధనే రికార్డు బ్రేక్..
జయవర్థనే వరుసగా 29 ఇన్నింగ్స్‌ల్లో రెండు అంకెల స్కోర్లు చేశాడు. హిట్‌మ్యాన్ వరుసగా 30 ఇన్నింగ్స్‌ల్లో డబుల్ డిజిట్ స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2021-23 సీజన్‌లో ఇప్పటివరకు 30 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్.. 12, 161, 26, 66, 25*, 49, 34, 30, 36, 12*, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 15, 46, 120, 32, 12, 12, 35, 15, 43, 103, 80, 57 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు, నాలుగు సెంచరీలు ఉన్నాయి.
జైస్వాల్‌తో అద్భుతమైన భాగస్వామ్యాలు..
ఇక విండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో 240 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ చేశాడు. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలు నమోదుచేశాడు. ప్రస్తుతం రెండో టెస్టులో విజయానికి 8వికెట్ల దూరంలో టీమిండియా ఉంది. ఐదో రోజు ఆట ప్రారంభంకాగానే త్వరత్వరగా వికెట్లు తీసి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 438 పరుగులు చేయగా.. విండీస్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడిన భారత్ 181 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. 365 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ఇప్పటికే తొలి టెస్టులో విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో ముందు వరుసలో ఉంది. ఈ మ్యాచులో కూడా విజయం సాధిస్తే సిరీస్ రోహిత్ సేన వశమైంది. టెస్టు సిరీస్ అనంతరం మూడు వన్డేలతో పాటు ఐదు టీ20ల సిరీస్‌లు జరగనున్నాయి.