దోపిడి దొంగలు ఇటీవల కాలంలో రూట్ మార్చారు. ఈ మధ్య ఎక్కువగా గన్‌లు పట్టుకోని తిరుగుతున్నారు. షాప్‌ల్లో దూరి బెదిరించి డబ్బులు లాక్కొంటున్నారు. మూసుగులు వేసుకోని రావడం.. గన్ చూపించడం.. వాటితో కాల్చుతానని చెప్పడం.. చోరీ చేయడం..ఇదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు. పక్కా ప్లాన్‌తో బయట ఒకడు, లోపల ఇద్దరు అన్నట్లు దొంగనాలు సాగుతున్నాయి.
చితకబాది.. అప్పగించారు:
ప్రేమ్‌విహార్‌లో సంతోష్ బాఘేల్, అతని కుమారుడు యశ్ బాఘేల్..జై దుర్గా జ్యువెలర్స్ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో హెల్మెట్ ధరించి షాపులోకి చొరబడ్డారు సాయుధులైన ముగ్గురు దొంగలు. ఓనర్స్‌తో పాటు, కస్టమర్స్‌ను తుపాకీతో బెదిరించి షాప్ కౌంటర్‌లోని బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా..ఇద్దరు పరారయ్యారు. ఓ దుండగుడు పట్టుబడ్డాడు. అతన్ని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.
గతంలోనే మూడు కేసులు:
మరోవైపు తమ బైకులను అక్కడే వదిలేసిన ఇద్దరు దుండగులు..రోడ్డుపై ఓ బైకర్‌ను గన్‌తో బెదిరించి అతని బైక్ లాక్కొని పరారయ్యారు. ఈ రెండు ఘటనలపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పట్టుబడిన దొంగ నంద్‌నగ్రీకి చెందిన ఫైజాన్‌గా గుర్తించారు. అతనిపై గతంలో మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ మొదటివారంలో బెయిల్‌పై విడుదలయ్యాడు. అతని నుంచి నాలుగు బుల్లెట్లతో కూడిన ఓ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. దుండగులు వదిలివెళ్లిన బైకులు కూడా చోరీ చేసినవేనా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు వదిలివెళ్లిన రెండు బైక్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫైజాన్‌ను విచారిస్తున్నామని, అతని ఇద్దరు సహచరులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: వెంబడించి, వేటాడి కారుతో గుద్ది గుద్ది చంపాడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!