అదనపు చక్కెర(షుగర్) ఉండే పానీయాలు, స్వీట్లు, పళ్ల రసాల వలన గుండె సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉందని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. రోజూ తీసుకునే ఆహారంలో చక్కెరను 5ులోపుగా ఉండేలా చూసుకోవాలని వారు సూచించారు. ఈ మేరకు బీఎంసీ మెడిసిన్ జర్నల్‌లో తమ అధ్యయన వివరాలను ప్రచురించారు.
‘‘యూకే బయోబ్యాంకులో ఉన్న 1,104,97మందికి సంబంధించిన ఆరోగ్య వివరాల ఆధారంగా 9ఏళ్లకు పైగా అధ్యయనం నిర్వహించాం. వీరిలో 4188మందిలో గుండె సంబంధిత వ్యాధులు, 3138మందిలో హృద్రోగాలు, 1124మందిలో గుండెపోటుతో కూడిన అనారోగ్యం గుర్తించాం.
ఈ విషయంలో మొత్తంగా కార్బోహైడ్రేట్ల పాత్ర పెద్దగా లేదు. శీతల పానీయాలు, దుకాణాల్లోని పళ్ల రసాలు, స్వీట్ల వలన మాత్రం హృద్రోగాల తీవ్రత పెరుగుతోంది. పళ్లు, కూరగాయల వంటి ప్రకృతిసిద్ధంగా లభించే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చు’’ అని పరిశోధకులు స్పష్టం చేశారు.