తెలంగాణలో ప్రభుత్వం చచ్చిపోయింది.. సర్కార్ నిర్లక్ష్యంతోనే వరదలు

తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. పాలకపక్షం కక్కుర్తితో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. నిజాం కాలం నాటి చెరువులను బీఆర్ఎస్ నేతలు ఆక్రమించడంతో వరదలు సంభవిస్తున్నాయని ఆరోపించారు.

New Update
తెలంగాణలో ప్రభుత్వం చచ్చిపోయింది.. సర్కార్ నిర్లక్ష్యంతోనే వరదలు

ప్రజల ప్రాణాలపై శ్రద్ధ లేదు..

రాష్ట్ర ప్రజలు వరదలతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోవడంలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై కేసీఆర్‌కు లేదని విమర్శించారు. ప్రగతిభవన్‌లో వరదలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేయకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే పార్టీల్లో మునిగిపోయారని దుయ్యబట్టారు. భారీ వర్షాలపై వాతావరణశాఖ ముందుగా హెచ్చరించినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. వరద సహాయక చర్యలు చేపట్టడంతో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాలలో పర్యటించిన ఆయన వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పరామర్శించారు.

మృతులను పరామర్శించలేదు..

వరదల వల్ల రాష్ట్రంలో 30 మంది చనిపోయినా కేసీఆర్ ఎందుకు పరామర్శించడంలేదని ప్రశ్నించారు. వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడంలేదా? అని అడిగారు. తక్షణమే కేంద్రప్రభుత్వం వరద సాయం కింద తెలంగాణకు రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ బాధ్యతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఉందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైదరాబాద్‌లోనే కాదు వరంగల్, ములుగు, భద్రాచలం వంటి ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయన్నారు. నిజాం కాలం నాటి చెరువులను బీఆర్ఎస్ నేతలు ఆక్రమించడంతో వరదలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఆక్రమణలతో అన్ని బస్తీల్లోకి నీరు వస్తోందన్నారు.

మేడిపండులాగా హైదరాబాద్ పరిస్థితి..

పట్ణణాలే కాదు పల్లెల్లో కూడా చెరువులను వదలడం లేదని.. ఇసుక మాఫియా వల్ల కూడా చెరువుల్లో నీరు దిశ మార్చుకుని ఇళ్లల్లోకి వస్తుందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. హైదరాబాద్ పరిస్థితి మేడిపండు లాగా ఉందన్నారు. పైకి ఏమో అందంగా కనిపిస్తున్నా లోపల మాత్రం పరిస్థితి అధ్వన్నంగా ఉందన్నారు. రాష్ట్రంలో 10లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. తొమ్మిదేళ్లుగా ప్రతీ ఏటా వరదలు రావడం, ప్రభుత్వం మరిచిపోవడం పరిపాటిగా మారిందని విమర్శలు చేశారు. రియల్ ఎస్టేట్‌లో అభివృద్ధి కోసమే ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి బీఆర్‌ఎస్ లో చేరారని ఆరోపించారు. ఆయన మూసీకి చైర్మన్ అయ్యి.. నియోజకవర్గ ప్రజలను మూసీలో ముంచారన్నారు. వరదల్లో నష్టపోయిన వారికి తాత్కాలిక నష్ట పరిహారంగా రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలి..

వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.25లక్షలు ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇసుక మేటలతో నిండిన వ్యవసాయ భూములకు రూ.20వేలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది... సీఎం, మునిసిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారన్నారు. ఈ ప్రభుత్వానికి వరద నీటిలో పిండ ప్రదానం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.3వేల కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోందన్నారు. పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వరద నష్టంపై నివేదిక ఇస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు