Revanth Reddy: తెలంగాణలో ఎన్నికల (Telangana Elections 2023) ప్రచార పర్వం ముగిసింది. విజయభేరి సభలతో కాంగ్రెస్ రాష్ట్రమంతటా ప్రచారాన్ని హోరెత్తించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుండి నడిపించారు. కాంగ్రెస్ తన ప్రచారంలో ఆరు హామీలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ ప్రచారాన్ని కొనసాగించింది. జాబ్ క్యాలెండర్ వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చి విద్యార్థులు, నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) వంటి అగ్రనేతలతో పాటు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా తెలంగాణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావించి విస్తృతంగా సభల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రచార ఘట్టం ముగిసిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ట్విట్టర్ లో తమ పార్టీని గెలిపించడం ఇప్పుడు రాష్ట్రానికి అవసరమంటూ వీడియో సందేశాన్ని షేర్ చేశారు.
ఇది కూడా చదవండి: దేవుడి సాక్షిగా చెప్తున్నా.. కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై ‘భట్టి’ ప్రమాణం
60 సంవత్సరాల పోరాటం, వందలాది తెలంగాణ బిడ్డల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, రాష్ట్రంలో కేసీఆర్ను పదేళ్లు ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణను పూర్తిగా విధ్వంసం చేశారని అన్నారు. మూడోసారి రాజ్యాన్నేలాలని కేసీఆర్ (KCR) కోరుకుంటున్నారని; అయితే ఈ ఎన్నికల్లో మార్పు తెచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి నడుం బిగించాలని వీడియోలో ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇందుకోసం 30లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ నాయకత్వంలో ఏర్పడబోయే ఇందిరమ్మ రాజ్యంలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.