Telangana Elections 2023: కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలకు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలోని ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదని చెప్పలేదని, కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టి తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఘోర పరాజయం యాదృచ్ఛికమైతే కాదని, కాలం దాన్ని అలా నిర్దేశించిందని చెప్పుకొచ్చారు. 2009 నవంబర్ 29న శ్రీకాంతాచారి ఒంటికి నిప్పంటించుకుని డిసెంబరు 3న అసువుల బాశాడని; ఆ త్యాగంతో ఉద్యమం ఆకాశమంత ఎత్తుకు ఎగిసి డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై మంత్రి చిదంబరం ప్రకటన వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడూ అవే తేదీల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు జరిగి రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయన్నారు. తెలంగాణలో శాశ్వతంగా అధికారం చెలాయించాలని భావించిన కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్‌దే ఆధిక్యం.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ లెక్కలివే..!
ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణ:
గెలుపోటములకు అతీతంగా ప్రజాస్వామ్య విలువలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందన్న రేవంత్ రెడ్డి, ప్రతిపక్షాలతో పాటు అన్ని వర్గాలనూ కాంగ్రెస్ గౌరవిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేస్తామన్నారు. తాము పాలకులుగా కాకుండా, సేవకులుగా వ్యవహరిస్తామని; సామాజిక న్యాయానికి తమ పార్టీ పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ సమాజానికి ఏకైక శతృవు కేసీఆర్ కుటుంబం మాత్రమేనన్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉండవని తెలిసే కేసీఆర్ కు తెలుసు కాబట్టే, ప్రెస్ మీట్ కు రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఇది కూడా చదవండి: 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌దే హవా..!
తెలంగాణ సమాజ చైతన్యమిది:
కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి కోసం కాంగ్రెస్ కార్యకర్తలు అహోరాత్రులూ శ్రమించారన్నారు. ఓటమి అంచుకు వెళ్లినప్పుడల్లా పోటీ చేసే స్థానాన్ని మార్చడం అలవాటు చేసుకున్న కేసీఆర్ ను ఈ సారి తమ కార్యకర్తలు కామారెడ్డిలో వలవేసి ఓడగొట్టారన్నారు. కామారెడ్డి ప్రజల విలక్షణమైన తీర్పు తెలంగాణ సమాజ చైతన్యానికి నిదర్శనమన్నారు. నిరుద్యోగ యువత ప్రత్యేక బాధ్యత తీసుకుని కాంగ్రెస్ విజయంలో కీలకంగా వ్యవహరించారని రేవంత్ రెడ్డి అన్నారు. వారి ఆశయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు.