Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎనుముల రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఒడుదుడుకులను ఎదుర్కొంటూ సాగింది. విద్యార్థి రాజకీయాల స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ క్రమక్రమంగా ఆయన ఎదిగారు. ఏడుగురు అన్నదమ్ములు, ఒక చెల్లెలి తోడబుట్టిన రేవంత్ రెడ్డి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి. చిన్ననాటి నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు బాగా ఉండేవని మిత్రులు చెప్తారు.
ఇది కూడా చదవండి: తుపాను ఎఫెక్ట్.. అధికారులకు రేవంత్ కీలక ఆదేశాలు
రేవంత్ రెడ్డి బాల్యం, పాఠశాల విద్య వరకూ సొంత ఊరి దగ్గరే ప్రభుత్వ పాఠశాలలో కొనసాగాయి. పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నారని సన్నిహితులు చెప్తారు. ఇంటర్మీడియట్ విద్యను ఓ ప్రైవేటు కాలేజీలో పూర్తిచేసిన రేవంత్‌లో అప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. తర్వాత ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు రావడంతో రేవంత్ రెడ్డి జీవితం కొత్త మలుపు తిరిగింది. అక్కడే ఆయన రాజకీయంగా కీలక దశలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో బీఏతో డిగ్రీ పూర్తిచేశారు. డిగ్రీ చదివే సమయంలో రేవంత్ రెడ్డి ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
ఆ విధంగా ఆయన విద్యార్థి రాజకీయాల్లో అడుగుపెట్టారు. విద్యార్థి నేతగా వారి సమస్యల పరిష్కారం కోసం విశేషంగా కృషి చేశారు. అనంతరం వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరి 2004లో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించినా రాలేదు. 2006లో జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ తరఫున కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఆ విధంగా క్రమక్రమంగా విద్యార్థి నేత స్థాయి నుంచి జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదిగి ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించనున్నారు.