Retail Inflation: మళ్ళీ ద్రవ్యోల్బణం బూచి భయపెడుతోంది. మూడు నెలలుగా తగ్గుతూ వచ్చి.. అదుపులో ఉంది అనుకునే లోపే.. నవంబర్ నెలలో పెరిగిపోయింది. అక్టోబర్ నెలతో పోలిస్తే ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. మూడు నెలల క్షీణత తర్వాత నవంబర్‌లో భారత రిటైల్ ద్రవ్యోల్బణం 5.55 శాతానికి పెరిగింది. కూరగాయలు, పండ్ల ధరలు అధికంగా ఉండడమే ఇందుకు కారణం. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.87 శాతంగా ఉంది. సెప్టెంబర్‌లో ఇది 5.02 శాతంగా ఉంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డేటా ప్రకారం, నవంబర్‌లో ఉల్లిపాయల ధరలు 58% నెలవారీగా (MoM) పెరగగా, టమోటా ధరలు 35% పెరిగాయి. ఇది కాకుండా, బంగాళాదుంప ధరలు కూడా నవంబర్‌లో 2% పెరిగాయి.
- ఆహార ద్రవ్యోల్బణం రేటు 6.61% నుండి 8.70%కి పెరిగింది
- గ్రామీణ ద్రవ్యోల్బణం 5.12% నుంచి 5.85%కి పెరిగింది.
- పట్టణ ద్రవ్యోల్బణం రేటు 4.62% నుండి 5.26%కి పెరిగింది
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద ఉంచాలనేది RBI లక్ష్యం
నిజానికి 2-6 శాతం మధ్య ద్రవ్యోల్బణం(Retail Inflation) ఆదర్శవంతంగా చెబుతారు. అయితే.. RBI రిటైల్ ద్రవ్యోల్బణం 4% వద్ద ఉండాలని కోరుకుంటుంది. ఇటీవలి ద్రవ్య విధాన సమావేశంలో, RBI FY24 రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను 5.40% వద్ద కొనసాగించింది. కానీ, దానిని మించి నవంబర్ ద్రవ్యోల్బణం ఉండడం కాస్త ఆందోళన కలిగించేదే. మూడు నెలలు ద్రవ్యోల్బణం అదుపులో ఉండడంతో ఆర్బీఐ ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేదు. కానీ, ఇపుడు మళ్లీ రేపో రేటు పెంచడంపై ఆర్బీఐ ఆలోచనలు చేసే అవకాశం ఉంది.
ద్రవ్యోల్బణం ప్రజల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
ద్రవ్యోల్బణం(Retail Inflation) నేరుగా కొనుగోలు శక్తికి సంబంధించినది. ఉదాహరణకు, ద్రవ్యోల్బణం రేటు 6% అయితే, సంపాదించిన రూ. 100 విలువ కేవలం రూ.94 మాత్రమే ఉంటుంది. అందువల్ల, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే పెట్టుబడి పెట్టాలి. లేదంటే మీ డబ్బు విలువ తగ్గిపోతుంది.
ద్రవ్యోల్బణం పెరగడం.. తగ్గడం ఇలా..
ద్రవ్యోల్బణం(Retail Inflation) పెరుగుదల- తగ్గుదల ఉత్పత్తి - డిమాండ్ -సరఫరాపై ఆధారపడి ఉంటుంది. ప్రజల వద్ద ఎక్కువ డబ్బు ఉంటే వారు ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోతే, ఈ వస్తువుల ధర పెరుగుతుంది. ఈ విధంగా మార్కెట్ ద్రవ్యోల్బణానికి గురవుతుంది. మామూలు మాటల్లో చెప్పాలంటే, ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండడం లేదా మార్కెట్లో వస్తువుల కొరత ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. అడే డిమాండ్ తక్కువగా ఉండి సరఫరా ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుంది.
Also Read: భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు..కిలో ఎంతకు చేరిందంటే..!
ద్రవ్యోల్బణం CPI ద్వారా నిర్ణయిస్తారు..
వినియోగదారుగా, మీరు - నేను రిటైల్ మార్కెట్ నుంచి వస్తువులను కొనుగోలు చేస్తాము. దీనికి సంబంధించిన ధరలలో మార్పులను చూపించే పనిని వినియోగదారు ధర సూచిక అంటే CPI చేస్తుంది. వస్తువులు - సేవలకు మనం చెల్లించే సగటు ధరను CPI కొలుస్తుంది.
ముడి చమురు, కమోడిటీ ధరలు, తయారీ ఖర్చులు కాకుండా, రిటైల్ ద్రవ్యోల్బణ రేటును నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అనేక అంశాలు ఉన్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం(Retail Inflation) రేటును నిర్ణయించే ధరల ఆధారంగా దాదాపు 300 వస్తువులు ఉన్నాయి.
పారిశ్రామిక వృద్ధి 16 నెలల గరిష్ఠ స్థాయికి..
మరోవైపు అక్టోబర్‌లో పారిశ్రామిక వృద్ధి 16 నెలల గరిష్ఠ స్థాయి 11.7%కి చేరుకుంది. భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్ 2022లో 4.1% క్షీణించింది. తయారీ, మైనింగ్ మ- విద్యుత్ రంగాల వృద్ధి కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది.
Watch this interesting Video: