Telangana Elections 2023: తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ఎప్పట్లాగే ఈ సారి కూడా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఓటింగ్ శాతంలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. గ్రామాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపి ఉదయం నుంచే బారులు తీరగా, పట్టణ ప్రాంతాల్లో ఆ పరిస్థితి కనిపించలేదు. మరోవైపు నగరం నుంచి వివిధ జిల్లాలు, గ్రామాలకు తరలివెళ్లే ప్రజలతో ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, ఇతర కూడళ్లన్నింటిలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇక హైదరాబాద్ నగరంలో ఎప్పటిలాగే ఓటింగ్ చాలా స్వల్పంగా నమోదు కావడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరంలో తక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడానికి పలు కారాణాలను గమనించవచ్చు.
పోలింగ్ స్లిప్పుల పంపిణీలో అలసత్వం కారణంగా అనేక మంది ఓటింగుకు దూరమయ్యారు. స్లిప్పులు సరిగ్గా పంపిణీ చేయకపోవడంతో తమ ఓటు ఏ బూత్ లో ఉందో తెలియక చాలా మంది అయోమయానికి లోనయ్యారు. నగరంలోని ట్రాఫిక్ వ్యూహాలను ఛేదిస్తూ పోలింగ్ బూత్ లు అన్నిటికీ తిరిగే ఓపిక లేక చాలామంది ఓటింగ్ కు దూరమయ్యారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో ముగిసిన పోలింగ్
అంతేకాకుండా, ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ చాలా కంపెనీలు ఎన్నికల రోజు సెలవు ప్రకటించలేదు. ఎన్నికల సంఘం పేర్కొన్న ఫిర్యాదుల నంబరుకు వేలసంఖ్యలో కాల్స్ రావడమే ఇందుకు నిదర్శనం. దూర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారిని చాలా చోట్ల ఇది పోలింగ్ కు దూరంగా ఉంచింది.
ఇది కడా చదవండి: అసలు బర్రెలక్క ఎవరు?!.. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి సంచలన వ్యాఖ్యలు
మరో ముఖ్య కారణం నగర ఓటర్లలో చాలా మందికి ఒక్కొక్కరికీ రెండు ఓట్లుండడం. నగరంలో నివసిస్తున్న వారికి తమ గ్రామంతో పాటు నగరంలో కూడా ఓటు ఉండడంతో ఎక్కువ మంది ఓటు వేసేందుకు గ్రామాలకు తరలివెళ్లారు. ఇది నగరంలో ఓటింగ్ శాతంపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్పష్టమైన గణాంకాలు వెలువడే సమయానికి రాష్ట్రంలో పోలింగ్ 80శాతానికి దాటవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం అత్యధికంగా మెదక్, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాల్లో ఓటింగ్ నమోదైంది.