Real Estate Fraud: ప్రీలాంచ్ ఆఫర్స్ పేరుతో.. ఫ్లాట్లు ఇస్తామంటూ ఏపీ, తెలంగాణలలో ఒకటి కాదు రెండు ఏకంగా వేలాది మంది నుంచి రూ.1500 కోట్లు కొట్టేశాడు సాహితీ సంస్థ ఎండీ భూదాటి లక్ష్మీనారాయణ. బాధితులకు మాయమాటలు చెబుతూ.. గట్టిగా నిలదీసిన వారిని బెదిరిస్తూ కొన్నేళ్లు కాలం గడిపాడు. చివరకు బాధితులంతా సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో జైలు పాలయ్యాడు. అనంతరం డిసెంబర్ 3, 2022న కోర్టు నుంచి కండిషనల్ బెయిల్ పొందాడు. 10 నెలలుగా కండిషనల్ బెయిల్‌లో ఉన్నా ఒక్కరోజు కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టిన పాపాన పోలేదు ఈ ఘనుడు. ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో బాధితులు సైలెంట్‌గా ఉండడం.. పోలీసులు బిజీగా ఉండడంతో.. వారి కళ్లు గప్పి బెంగళూరు నుంచి నేపాల్‌కు.. అక్కడి నుంచి దొంగ పాస్‌పోర్ట్‌తో దుబాయ్‌కి పారిపోయినట్లు సన్నిహితుల సమాచారం. అక్కడ శ్రీనిధి శ్రీహరితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ.. జల్సాలు చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈడీ ఉచ్చుతో అప్పటికే శ్రీనిధి శ్రీహరి కుటుంబం దుబాయ్‌లో తిష్టవేసినట్లు తెలుస్తోంది. అయితే సాహితీ 15 వందల కోట్ల అక్రమ సంపద ఎక్కడికి పోయిందో ఇప్పటికి తెలంగాణ పోలీసులు తేల్చలేకపోతున్నారు.
ఇది కూడా చదవండి: ఎన్ఐఏ దాడుల్లో నివ్వెరపోయే విషయాలు.. భారీ పేలుళ్లకు ఉగ్ర కుట్ర.. 8 మంది అరెస్టు
3000 మందికి పైగా బాధితులు..
3 వేల మందికి పైగా సొంతింటి కోసం 30 లక్షల నుంచి 6 కోట్ల వరకు సాహితీ సంస్థకు చెల్లించారు. నోట్ల కట్టలకు ఆశపడ్డ అధికారులు భూమికి టైటిల్ లేకుండానే ఎడాపెడా అనుమతులు ఇచ్చేశారు. రేరా అనుమతులతో బొల్తా కొట్టించారు. తక్కువ ధరకు ఆశ పడి ఇంటికోసం ప్రీ లాంచ్ లో పెట్టుబడి పెట్టారు బాధితులు. అమీన్ పూర్, మాదాపూర్, కొంపల్లి, కూకట్‌పల్లి, ప్రగతి నగర్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలోని ప్రాజెక్టులలో రూ.1500 కోట్లు కూడగట్టుకొని బిచాణా ఎత్తేశాడు సాహితీ రియల్ సంస్థ లక్ష్మీనారాయణ. ఆ డబ్బు మొత్తాన్ని వివిధ రూపాల్లో దుబాయ్‌కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
భూములు కొట్టేసేందుకు ఓ ఛీటర్ ప్లాన్..
భూదాటి లక్ష్మీనారాయణ పేరు మీద పలుచోట్ల అస్తులు, డెవలప్‌మెంట్ అగ్రిమెంట్స్ ఉన్నట్లు తెలిసింది. వాటన్నింటినీ తక్కువ ధరకు కొట్టేసేందుకు గతంలో ఛీటర్‌గా పేరున్న ఓ కన్వెన్షన్ సెంటర్ ఓనర్ సెటిల్మెంట్లకు దిగుతున్నట్లు సమాచారం. అందుకు సీఎం, డీజీపీ తనకు క్లోజ్ అంటూ వారి పేర్లను వాడుతున్నట్లు తెలిసింది. అయితే గతంలో కూడా కేటీఆర్ పేరును వాడుకుని దందాలు చేయడంతో అప్పుడు కేటీఆర్ చీదురించుకున్నట్లు వినికిడి. ఇప్పుడు సీఎం, డీజీపీ పేర్లను విరివిగా వాడుతుండటంతో పోలీసులు మరింత నిఘా పెంచారు. కాంగ్రెస్ నేతలంతా తన చెప్పుచేతల్లో ఉన్నారని చెప్పుకోవడంతో పాటు.. దుబాయ్‌లో ఉన్న దొంగలకు సెటిల్మెంట్ల స్టేటస్ అప్‌డేట్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో బూదాటి లక్ష్మీనారాయణకు ఈ కన్వెన్షన్ ఓనర్‌కు లావాదేవీలు జరిగినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. వివాదస్పదంగా ఉన్న ఆస్తులను మరొకరి చేతిలో పెట్టెందుకు భారీ ఎత్తున ప్లాన్స్ వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే 3వేల మంది జీవితాలు పెనంలోంచి పొయిలో పడ్డట్లే అంటున్నారు సాహితీ బాధితులు.
ఇది కూడా చదవండి: హైదరాబాదు డ్రగ్స్ దందాలో పొలిటిషన్ కొడుకు.!
సీఎం రేవంత్ న్యాయం చేయాలని వేడుకోలు
50కి పైగా కేసులున్నా.. 10 నెలలుగా సంతకాలు పెట్టకుండా తిరుగుతున్న సాహితీ ఎండీ గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. అధికారుల కళ్లముందే అటు మైహోం బూజాలో , మెయినా బాద్ ఫామ్ హౌజ్‌లో అతని చిన్ననాటి స్నేహితుడు గూని బ్రహ్మంతో కలిసి కాకినాడకు తిరిగినా పట్టించుకోలేదన్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు నోట్లు కోట్టి కళ్లు మూయించారని వాపోతున్నారు. గతంలో హైకోర్టు అదేశాలతో 50 కేసులను సీసీఎస్‌కి బదిలీ చేసినా.. ఇప్పటి వరకు ఇంకా విచారణ చేపట్టలేదు. గతంలో దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన లక్ష్మీనారాయణ కుమారుడు, నిందితుడు సాత్విక్‌ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత అధికారుల కళ్లు గప్పి దేశం విడిచి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి చాలా సార్లు ప్రయత్నాలు చేశారు. ఇందుకు ఓ పోలీస్ అధికారి సహాయసహాకారాలు ఉన్నట్లు తెలుస్తుంది. మిగతా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మోసగాళ్లను అరికడితేనే ప్రపంచ స్థాయి నగరంగా పేరుగాంచుతుందని, ఇందుకు సాహితీ కేసును పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాధితులు, మేధావులు వాపోతున్నారు. సీఎం చొరవ తీసుకొని తమకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని.. నిందితులను వారి వెనక ఉన్న వారిని కఠినంగా శిక్షిస్తే మరోసారి ఇలాంటి ప్రీ లాంచ్ మోసాలు జరగకుండా ఉంటాయని బాధితులు వేడుకుంటున్నారు. 10 రోజుల్లో ప్రభుత్వం స్పందించపోతే.. మళ్లీ ధర్నా చౌక్‌లో ఉద్యమాలు చేస్తామని అంటున్నారు.
గతంలో టీటీడీ మెంబర్‌గా..
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన లక్ష్మీనారాయణ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సాహితీ ఇన్‌ఫ్రా టెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు. 2019 నుంచి పలు ప్రాజెక్టులు మొదలుపెట్టాడు. ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో తక్కువ ధరకే డబ్బులు ఇస్తామంటూ మధ్యతరగతి వర్గాల నుంచి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేయడమే ఈ సంస్థ పని. తరువాత ఏదో పనులు జరుగుతున్నట్లు చూపించి.. బిల్డప్ ఇస్తారు. ఎవరైనా గట్టిగా అడిగితే చంపుతామని బెదిరిస్తారు. ఇప్పటికి దాకా ఇలా 3000 మందికి పైగా బాధితుల నుంచి రూ.1500 కోట్లు వసూలు చేశారు. అయితే లక్ష్మీనారాయణను 2021లో టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అప్పట్లోనే అతనిపై పలు ఆరోపణలొచ్చాయి. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అనంతరం బాధితులు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడంతో చివరకు కథ అడ్డం తిరిగింది. 2022 డిసెంబర్ 3న పోలీసులు బూదాటిని అరెస్ట్ చేశారు. అప్పుడు టీటీడీ సభ్యుడి పదవికి రాజీనామా చేశారు.