మణిపూర్‌లో పరిస్థితులపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా వుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రకటించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎందుకు సహకరించడం లేదో తెలపాలని ఆయన ప్రశ్నించారు. మణిపూర్ పరిస్థితులపై లోక్ సభలో చర్చకు సహకరించాలని ప్రతిపక్షాలను అమిత్ షా కోరారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచే మణిపూర్ అల్లర్లపై ఉభయ సభలో రచ్చ జరుగుతోంది. అల్లర్ల ఘటనలపై సభలో చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే చర్చకు తాము రెడీగా వున్నామని ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా సభలో ప్రకటించారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం సభలో ఆందోళనకు దిగుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా అమిత్ షా ఈ రోజు సభలో మాట్లాడారు. మణిపూర్ అంశంలో వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అంశంపై చర్చ జరగాలని అధికార, విపక్షాలు కోరుకుంటున్నాయని చెప్పారు. అందువల్ల ఈ అంశంపై చర్చకు సహకరించాలని సభ్యులను ఆయన కోరారు.
కానీ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో గందర గోళ పరిస్థితుల నడుమ లోక్ సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అంతకు ముందు రాజ్యసభలోనూ మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టాయి. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్ లోకి దూసుకు వచ్చారు. దీంతో ఎంపీపై చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీని సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు.