Rave Party vs Political Parties: రేవ్ పార్టీ.. సాధారణంగా ఈ పేరుతో ఎప్పుడైనా వార్తలు వస్తే అవి సెలబ్రిటీల చుట్టూ తిరిగేవి. గతంలో హైదరాబాద్ లో ఎక్కువగా రేవ్ పార్టీల మాట వినిపించేది. పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో అవి ఇప్పుడు బెంగళూరుకు షిఫ్ట్ అయిపోయాయి. తాజాగా బెంగళూరు శివార్లలో నిర్వహించిన రేవ్ పార్టీ రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. రేవ్ పార్టీపై పోలీసుల దాడి జరిగిన దగ్గర నుంచి.. అందులో ఎవరు పాల్గొన్నారు? ఎవరి నిర్వహణలో ఇది జరిగింది? అనే ప్రశ్నల కోణంలో విపరీతమైన సంచలనాలు చోటు చేసుకున్నాయి. సహజంగానే ఒకరిద్దరు సెలబ్రిటీల పేర్లు ముందు బయటకు వచ్చాయి. అయితే, వాటితో పాటు ఏపీ మంత్రి పేరు కూడా బయటకు రావడం సంచలనంగా మారింది. ఆయన పేరుతో స్టిక్కర్ ఉన్న కారు సంఘటనా స్థలం వద్ద కనిపించడంతో ఈ రేవ్ పార్టీ వ్యవహారం పొలిటికల్ పార్టీల మధ్య వార్ గా మారిపోయింది.
Rave Party vs Political Parties: మంత్రి కాకాని గోవర్ధన్ స్టిక్కర్ ఉన్న కారు కనిపించడంతో టీడీపీ వెంటనే ఎలర్ట్ అయింది. మంత్రిని విమర్శిస్తూ.. వరుసగా టీడీపీ నాయకులు ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. మరోవైపు సోషల్ మీడియాలో టీడీపీ అనుకూలురు వరుసగా పోస్ట్ లు పెడుతూ కాకానికి ఈ రేవ్ పార్టీకి సంబంధం ఉందంటూ ప్రచారం మొదలు పెట్టారు.
Also Read: టాలీవుడ్ నటి హేమకు బిగ్ షాక్.. నోటీసులు ఇచ్చిన బెంగళూరు పోలీసులు..!
అదంతా వట్టిదే.. అసలు అది నా కారే కాదు అని కాకాని ఎంతగా చెప్పినా రాజకీయ పోస్ట్ ల దాడులు మాత్రం ఆగలేదు. తరువాత పార్టీ నిర్వహించిన కేసుకు సంబధించి నిర్వాహకులను అరెస్ట్ చేసి.. వారి వివరాలు బయటకు వచ్చిన తరువాత.. వారిలో మీవారూ ఉన్నారంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఎదురుదాడికి దిగింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ మొదలైంది. ఇటు టీడీపీ - అటు వైసీపీ రేవ్ పార్టీలో దొరికిన వారు మీవారంటే.. మీవారంటూ బురద పోస్టులను వరదలా సోషల్ మీడియాలో చల్లుకుంటూ వస్తున్నారు.
ఈ సీన్ లో నటి హేమ చేసిన హంగామా.. కప్పదాట్లను మించి ఇప్పుడు వైసీపీ-టీడీపీ చేస్తున్న పోస్ట్ ల హడావుడి ఎక్కువైపోయింది. ఒక పక్క మాచర్ల ఈవీఎం ధ్వంసంలో ఒక మాజీ మంత్రిపై దుమారం రేగుతుండగా.. దానికి తోడుగా ఈ రేవ్ పార్టీ వ్యవహారం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రేండింగ్ టాపిక్స్ గా మారిపోయాయి.