2020లో గంజాయిని అక్రమ రవాణా చేస్తూ చెన్నై మెరీనా బీచ్ పోలీసులకు చిక్కారు రాజ్‌గోపాల్, నాగేశ్వరరావు అనే స్మగ్లర్లు. వీరి నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. నిందితులను జైలుకు పంపారు. మూడేళ్ల దర్యాప్తు తర్వాత NDPS కోర్టులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా సీజ్ చేసిన గంజాయిని జడ్జి ముందు పెట్టారు. అయితే.. టేబుల్‌పై పెట్టిన పొట్లం చూసి న్యాయమూర్తి ఒక్కసారిగా షాక్ అయ్యారు.
గంజాయిని ఎలుకలు తిన్నాయని చల్లనికబురు
నిందితుల నుంచి 21 కిలోల 950 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. అయితే.. జడ్జి ముందు పెట్టింది మాత్రం కేవలం 50 గ్రాములు మాత్రమే. మిగిలిన గంజాయి ఎక్కడ ఉందని జడ్జి ప్రశ్నించగా దీనికి పోలీసులు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా..? వాళ్లు చెప్పింది వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. భద్రంగా సీజ్ చేసి దాచిన గంజాయిని ఎలుకలు తిన్నాయని చల్లటి కబురు చెప్పారు. అది కూడా ఒకటి, రెండూ కాదు ఏకంగా 22 కిలోల గంజాయిని స్వాహా చేశాయట.
సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితులకు ఊరట
ఇదంతా కేసు విచారణలో స్వయంగా పోలీసులు కోర్టు జడ్జి ముందు చెప్పిన సమాధానం ఇది. ఈ సమాధానం విన్న న్యాయమూర్తితో పాటు కోర్టు ఆవరణలో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. సాక్ష్యాధారాల పరిశీలన విషయంలో ఇంత నిర్లక్ష్యం ఏంటని పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితులకు ఊరట లభించింది. దీంతో నిందితులు రాజగోపాల్, నాగేశ్వరరావులను నిర్దోషులుగా పేర్కొంటూ జడ్జి తీర్పునిచ్చారు. దేశంలోనే వింత ఘటన అంటూ ఈ వార్త తెలిసిన నెటిజన్లు ఎలుకలను పొగుడుతూ నిందితులను రక్షించిన ఎలుక మహారాజులు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరికొందరైతే ఎలుకా.. మజాకా... అంటూ కామెంట్లతో పొగిడేస్తున్నారు.