/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T231612.592.jpg)
Ramoji Rao: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు రామోజీరావును హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో..
ప్రస్తుతం 87 ఏళ్ల వయసున్న ఆయన గతంలోనూ అనారోగ్యంతో బాధపడ్డారు. వైరల్ ఫీవర్, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో సతమతమవగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇక ఈనాడు గ్రూప్‌కు చైర్మన్, రామోజీ ఫిల్మ్ సిటీకి యజమాని అయిన రామోజీరావు.. 60కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. దశాబ్దాల తరబడి రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు.
మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవినీతి ఆరోపణలు..
ఇటీవల మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. చిట్ ఫండ్ చట్టం నియమ నిబంధనలను ఉల్లంఘించి, నిధులను దారి మళ్లించారని రామోజీరావు తదితరులపై ప్రధాన ఆరోపణలు వచ్చాయి. చిట్స్ ద్వారా వసూలైన డబ్బును స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్ కు బదలాయించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ సంస్థ వివిధ చట్టాలకు వ్యతిరేకంగా వ్యాపారం చేస్తోంది అంటూ ఒకప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకు వెళ్లడంతో మొదలైన వ్యవహారం తరువాత అనేక మలుపులు తిరిగింది. ఇటీవల మార్గదర్శి కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్ లను విచారించారు. ఇప్పటికే మార్గదర్శి చిట్ ఫండ్స్ కు చెందిన నలుగురు బ్రాంచ్ మేనేజర్లను సీఐడీ అరెస్ట్ చేయడం తెలిసిందే.
సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన కేసు..
అయితే గతంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమంగా డిపాజిట్లు సేకరించిందంటూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. రాష్ట్రవిభజన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రుల్నీ ఈ విషయంలో సాయం కోరారు. అయితే తెలంగాణలో పరిస్ధితి ఎలా ఉన్నా ఏపీలో మాత్రం ఈనాడు పత్రికకు తోటి గ్రూపు సంస్ధ అయిన మార్గదర్శి చిట్ ఫండ్స్ పై జగన్ సర్కార్ చర్యలు తీసుకోవాలని ఉండవల్లి తాజాగా కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో మూలనపడ్డ మార్గదర్శి కేసును సుప్రీంకోర్టు మరోసారి తెరపైకి రాగా.. జగన్ కూడా చర్యలకు ఆదేశించారు.