Rakhi 2024 : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండగ రక్షాబంధన్ (Raksha Bandhan). 'రక్ష' అంటే రక్షించడం, 'బంధన్' అంటే సూత్రం అని అర్థం. తోబుట్టువులకు మంచి జరగాలని కోరుకుంటూ అక్కా చెల్లెల్లు రక్షగా కట్టే బంధనమే ఈ రక్షాబంధన్.
అన్నాచెల్లెల అనుబంధం
ఇతిహాసాల ప్రకారం ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెల బంధాన్ని (Brothers & Sisters Relation) అత్యంత గొప్ప బంధంగా చెబుతారు. శిశుపాలుడిని శిక్షించడానికి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు చూపుడు వేలుకు గాయమై రక్తం ధారగా కారుతుంది. అది చూసిన ద్రౌపది పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతకు శ్రీకృష్ణుడు ద్రౌపదిని దుశ్శాసనుడి దురాగతం నుంచి కాపాడుతాడు. అందుకని వాళ్ళ బంధాన్ని గొప్పగా చెబుతారు.
సోదరులు లేనివారు వీటికి రాఖీ కట్టండి
అయితే అన్నాతమ్ముళ్ళు లేని చాలా మంది రాఖీ పండుకు రోజున బాధపడుతుంటారు. తమకు కూడా జీవితంలో తోడుగా, అండగా తోబుట్టువులు ఉంటే బాగుండేది అని కలత చెందుతారు. ఇలాంటి వారు అసలు బాధపడాల్సిన అవసరం లేదు. మత విశ్వాసాల ప్రకారం, సోదరుడు లేకపోతే వేప, మర్రి, ఉసిరి, అరటి, శమీ, తులసి వృక్షాలకు రాఖీ కట్టవచ్చు. వీటిలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసం ఉంటారని భావిస్తారు. అందుకని ఈ చెట్లకు రాఖీ కడితే ముగ్గురు దేవుళ్ళు ఎంతో సంతోషిస్తారని అలాగే శుభం కలుగుతుందని చెబుతారు. ఇది కాకుండా మీ బంధువులలో సోదరుడు వరసైన వారికీ లేదా అన్నగా భావించే మరెవరికైనా రాఖీని కట్టవచ్చు.