సూపర్ స్టార్, తలైవా రజనీ కాంత్ యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ ను శనివారం కలిశారు. రాజధాని లక్నోలోని సీఎం అధికారిక నివాసంలో యోగీతో ఆయన భేటీ అయ్యారు. రజనీకాంత్ కు సీఎం యోగీ ఆదిత్య నాథ్, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి రజనీకాంత్ దంపతులను లోపలికి ఆహ్వానించారు. అనంతరం రజనీకాంత్ కు ఆయన ఓ జ్ఞాపికను కూడా అందజేశారు.
అంతకు ముందు జైలర్ స్పెషల్ స్క్రీనింగ్ ను ప్రదర్శించారు. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆ సినిమాను వీక్షించారు. కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు సీఎం యోగీ కూడా సినిమాను వీక్షిస్తారని మొదట వార్తలు వచ్చాయి. అయితే సీఎం యోగీ ఈ రోజు ఉదయం అయోధ్యకు వెళ్లినట్టు సమాచారం. సాయంత్రం ఆయన లక్నోకు తిరిగి రాగానే ఆయన్ని సూపర్ స్టార్ కలిసినట్టు తెలుస్తోంది.
సీఎం యోగీ ఆదిత్య నాథ్ ను కలిసి అనంతరం ఆయనకు రజనీకాంత్ పాదాభివందనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైలర్ స్పెషల్ స్క్రీనింగ్ కు ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా హాజరవుతారని మొదట వార్తలు వినిపించాయి. కానీ ఆయన హాజరు కావడంలేదని తర్వాత తేలిపోయింది.
స్పెషల్ స్క్రీనింగ్ అనంతరం డిప్యూ టీ సీఎం కేశవ ప్రసాద మౌర్య ట్వీట్ చేశారు. జైలర్’ సినిమా చూసే అవకాశం తనకు వచ్చిందన్నారు. తాను గతంలో రజనీకాంత్ నటించిన చాలా సినిమాలను చూశానన్నారు. అతను చాలా గొప్ప నటుడని కితాబిచ్చారు. కంటెంట్ లేకపోయినా, రజనీ తన నటనతో సినిమాను హిట్ చేయగలరని ఆయన కొనియాడారు.
అంతకు ముందు రజనీకాంత్ యూపీ గవర్నర్ అనందీ బెన్ పటేల్ ను కలిశారు. రాజ్ భవన్ లో ఆయన గవర్నత్ తో భేటీ అయినట్టు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. రజనీకాంత్ రేపు అయోధ్య వెల్లనున్నారు. యూపీ పర్యటనకు ముందు రజనీకాంత్ జార్ఖండ్ లో పర్యటించారు. అక్కడ పలు ఆలయాలను ఆయన సందర్శించారు.