పార్టీ మార్పుపై రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఈ రోజు తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మార్పుపై స్వామి వారి దర్శనం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ గురువు అని అన్నారు. చంద్రబాబు మరోసారి సీఎం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కావాలని నిరంతరం ఆలోచిస్తారని అన్నారు ప్రకాశ్ గౌడ్.
ఇక ప్రకాశ్ గౌడ్ విషయానికి వస్తే.. 2009 నుంచి ఆయన ఇక్కడ వరుసగా విజయాలు సాధిస్తున్నారు. 2009, 14 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన విజయం సాధించారు. 2014 ఎన్నికల తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ నుంచే 2018, 23 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన పార్టీ వీడుతారన్న ప్రచారం సాగుతోంది. ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
అప్పటి నుంచి ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఎంపీ ఎన్నికల సమయంలో ఆయన పార్టీ మారుతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో ప్రకాశ్ గౌడ్ పార్టీ మారలేదు. ఇటీవల ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో కేసీఆర్ ను సైతం ఆయన కలిశారు. దీంతో ప్రకాశ్ గౌడ్ పార్టీ మార్పు వార్తలకు కాస్త బ్రేక్ పడ్డాయి. కానీ.. ఆయన మళ్లీ మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.