/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rahulgandhi-jpg.webp)
దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఆజాద్ పూర్ మార్కెట్ సందర్శించారు. అక్కడి దుకాణదారులతో మాట్లాడి ధరలు అడిగి తెలుసుకున్నారు. అన్ని కూరగాయల ధరలు కేజీ వంద రూపాయలకుపైగా ఉన్నాయని, టమాటాల ధర అయితే కేజీ 200 రూపాయలు దాటిందని తెలిపారు. కూరగాయలన్ని కేజీ వంద రూపాయలకు పైగా పలుకుతున్నాయని రామేశ్వర్ అనే వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యారు. రోజుకు కనీసం వంద రూపాయలైనా సంపాదించలేకపోతున్నానని వాపోయాడు. పెరిగిపోతున్న ధరలతో తమ లాంటి సామాన్యులు బతకలేకపోతున్నామని ఆవేదన చెందాడు. రాహుల్ గాంధీ మార్కెట్‌కు చేరుకున్న విషయం తెలుసుకున్న జనం ఒక్కసారిగా గుమ్మిగూడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
VIDEO | Congress leader Rahul Gandhi met vegetable and fruit vendors at Delhi's Azadpur Mandi earlier today.
(Source: Third Party) pic.twitter.com/eSNgpk4nEE
— Press Trust of India (@PTI_News) August 1, 2023
ధనికులు, పేదల మధ్య పెరుగుతున్న అంతరం
ఈ వీడియోను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆజాద్ పూర్ కూరగాయల మార్కెట్ విజిట్ చేసిన అనంతరం రాహుల్.. నిత్యావసరాల ధరలు ఇంతగా పెరిగిపోతున్నా.. వీటిని ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందన్నారు. దేశం రెండు వర్గాలుగా విడిపోతోందన్నారు. ఓ వైపు అధికారాన్ని కాపాడుకోవాలని తహతహలాడుతున్న శక్తిమంతులు, మరోవైపు సామాన్య భారతీయుడు.. ఎవరి సూచనలమేరకు ఈ ప్రభుత్వం దేశ విధానాలను రూపొందిస్తుందని ప్రశ్నించారు. ధనిక, పేద వర్గాల మధ్య పెరిగిపోతున్న అంతరాన్ని పూరించాలని, ఈ కన్నీళ్లను తుడవాలని అన్నారు. కొద్దిమంది శక్తిమంతుల సూచనలతో దేశంలోని చట్టాలు రూపుదిద్దుకుంటున్నాయని రాహుల్ విమర్శించారు.
ఇటీవల భారత్ జోడో యాత్ర సందర్భంగా తన మోకాలికి అయిన గాయానికి ఆయన కేరళలోని ఓ ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స పొంది వచ్చారు. కొన్నిరోజుల క్రితం ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా వెళ్తుండగా మార్గంమధ్యలో హర్యానాలోని సోనిపట్‌లో రైతులతో సమావేశమయ్యారు. వరి పొలంలో ట్రాక్టర్ నడిపి.. కూలీలతో కలిసి నాట్లు కూడా వేశారు. అలాగే ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో మోటారు మెకానిక్‌లను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ట్రక్కులో ప్రయాణించి ట్రక్కు డ్రైవర్ల సమస్యలను వాకబు చేశారు. ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.