Rahul Gandhi is reinstated as Lok Sabha MP: మోదీ ఇంటిపేరు కేసులో(Modi Surname Case) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఆయనపై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. దీంతో నేడు(ఆగస్టు 7) జరిగే లోక్‌సభ సమావేశాలకు రాహుల్ హాజరయ్యారు. ఇండియా కూటమిగా ప్రతిపక్షాలు ఏకమవ్వడం, మణిపూర్ అల్లర్లపై మోదీని పార్లమెంటులో మాట్లాడించాని సంకల్పించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ అంశాలపై ఈ వారంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ కూడా లోక్‌సభలో అడుగుపెట్టడం శుభపరిణామంగా విపక్షాలు భావిస్తున్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్నాటక వెళ్లిన రాహుల్ గాంధీ ప్రచారంలో మోడీ ఇంటి పేరున్న వారంతా దొంగలేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు (Surat Court) ఈ ఏడాది మే నెలలో రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేస్తూ సచివాలయం ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే ఆ తర్వాత రాహుల్ గాంధీ జిల్లా కోర్టును, గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన ఊరట లభించలేదు. దీంతో చివరగా సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రింకోర్టు.. ఈ నెల 4న స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును రద్దు చేస్తూ లోక్‌సభ సచివాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా 2019 సాధారణ ఎన్నికల్లో రాహుల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీతో పాటు కేరళ రాష్ట్రంలోని వయనాడ్ స్థానాల నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే అమేథీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోగా.. వయనాడ్ నుంచి మాత్రం ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి వయనాడ్ ఎంపీగా పార్లమెంట్ లో ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్.. పరువు నష్టం కేసులో అనర్హత వేటుతో ఐదు నెలల నుంచి అనధికార ఎంపీగా ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు స్టేతో లోక్ సభ సచివాలయం అనర్హత వేటును ఎత్తివేయడంతో మళ్లీ వయనాడ్ ఎంపీగా కమ్ బ్యాక్ ఇచ్చారు.