కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం తమిళనాడు, కేరళలో పర్యటించారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించిన తర్వాత తొలిసారిగా ఆయన తన నియోజక వర్గం వయనాడ్ లో పర్యటించారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ఆయన ఊటీ సమీపంలోని ముత్తునాడు గ్రామంలో ఆయన పర్యటించారు. అక్కడ తోటీ తెగకు చెందిన ఆదివాసీ గిరిజనులతో కలిసి ఆయన సాంప్రదాయ గిరిజన నృత్యం చేశారు.
రాహుల్ గాంధీ గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి అక్కడి గిరిజనులతో కలిసి స్టెప్పులు వేశారు. వారితో చేతులు కలిపి ఆడి పాడారు. అనంతరం సమావేశం అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా గిరిజనులతో కలిసి ఆయన చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మొదట రాహుల్ గాంధీ కోయంబత్తూర్ కు చేరుకున్నారు. అనంతరం వయనాడ్ లో పర్యటించారు. రాహుల్ గాంధీ రెండు రాష్ట్రాల పర్యటన ముగిసిన తర్వాత యూరప్ పర్యటనకు వెళతారాని తెలుస్తోంది. అక్కడ యూనివర్శిటీ విద్యార్థులు, ప్రవాసీ భారతీయులు, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యులను కలుసుకుంటారు. అనంతరం బెల్జియం చేరుకుంటారు.
అంతకు ముందు వయనాడ్ లో ఆయన మాట్లాడుతూ... మణిపూర్ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. మణిపూర్ పై ఎవరో కిరోసిన్ చల్లి నిప్పు అంటించినట్టుగా వుందని అన్నారు. అవిశ్వాస తీర్మాన సమయంలో ప్రధాని మోడీ పార్లమెంట్ లో 2గంటల 13 నిమిషాలు మాట్లాడారని, అందులో కేవలం 2 నిమిషాలు మాత్రమే మణిపూర్ గురించి మాట్లాడారని మండిపడ్డారు.