కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల సింప్లిసిటీగా మారుపేరుగా నిలుస్తున్నారు. రైతులతో కలిసి నాట్లు నాటడం, లారీ డ్రైవర్లతో కలిసి ట్రక్కు నడపడం, చాక్లెట్ తయారుచేయడం, మార్కెట్‌కి వెళ్లి వ్యాపారులతో సందడి చేయడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్లారు రాహుల్. అక్కడ ఇద్దరు రాజకీయాలతో పాటు సరద సంభాషణలు చేసుకున్నారు. అనంతరం వంటలో బిజీ అయిపోయారు. మటన్ ఎలా వండాలి.. మసాలా ఎలా వేయాలని లాలూ చెబుతుంటే రాహుల్ వండేశారు. అనంతరం ఇద్దరు చక్కగా తినేసి ముచ్చట్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘‘నాకు వంట వచ్చు గానీ నేను ఎక్స్‌పర్ట్‌ని మాత్రం కాదు. యూరప్‌లో ఒంటరిగా ఉండేటప్పుడు వంట నేర్చుకోవాల్సి వచ్చింది. చిన్న చిన్న వంటకాలను చేయగలను. కానీ ఎక్స్‌పర్ట్ మాత్రం కాదు. లాలూ మాత్రం అద్భుతంగా వంట చేస్తారు’’ అని రాహుల్ తాబిచ్చారు. అద్భుతంగా వంట వచ్చిన భారత రాజకీయనేతల్లో లాలూ ముందుంటారని వీడియోలో తెలిపారు.
"నేను ఆరు, ఏడు తరగతుల్లో ఉండగా వంట నేర్చుకున్నాను. నా సోదరులను కలిసేందుకు పట్నా వెళ్లా. వాళ్లు అక్కడే పనిచేసేవారు. వాళ్లే నన్ను అక్కడికి పిలిపించారు. అక్కడ వాళ్లకు నేనే వంట వండేవాణ్ణి. వంట చెరకు సేకరించడం, అంట్లు తోమడం, మసాలా నూరడం.. అన్నీ అక్కడే నేర్చుకున్నా’’ అంటూ లాలూ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
రాజకీయాలకు సంబంధించి సీక్రెట్ మసాలా ఏంటని రాహుల్ ప్రశ్నించగా కష్టపడి పనిచేయడమేనని లాలూ సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో కూడా అన్నీ కలిపేయడం లాలూకు అలవాటు రాహుల్ తెలిపారు. అవును.. తాను అదే చేస్తా. అయితే కాస్తంత కలపకుండా రాజకీయాలు సాధ్యం కావు అని లాలూ చమత్కరించారు. పాత తరం నేతలు దేశాన్ని న్యాయబద్ధమైన మార్గంలో నడిపించారని ఆ విషయాన్ని యువ నేతలు మర్చిపోకూడదని అభిప్రాయపడ్డారు. పనిలో పనిగా బీజేపీ ప్రభుత్వంపైనా లాలూ సెటైర్లు వేశారు. కమలం పార్టీకి ‘రాజకీయ ఆకలి’ ఎక్కువని విమర్శించారు. ఇక ఈ వీడియోలో బీహార్ ఉపముఖ్యమంత్రి, లాలూ తనయుడు తేజస్వీ యాదవ్, సోదరి మీసా భారతి, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.