భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ఆయన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వనున్నారు. దీనితో పాటు, అనేక ఇతర కార్యక్రమాలలో ప్రధాని మోడీ పాల్గొంటారు. మోదీ పర్యటనకు ముందు, అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు మాట్లాడుతూ, ప్రధాని అమెరికా పర్యటనలో ఏయో అంశాలపై ఫోకస్ పెట్టనున్నారో వెల్లడించారు.
మోదీ పర్యటన తర్వాత తారాస్థాయికి రెండు దేశాల మధ్య సంబంధాలు:
ప్రధాని మోదీ పర్యటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు తెలిపారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరో స్థాయికి వెళ్లనున్నాయన్నారు. ఇది యావత్ ప్రపంచానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పర్యటన చారిత్రాత్మకమైందని…ఈ పర్యటన రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఐదు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సంధు తెలిపారు. ఇందులో మొదటి రక్షణ, వ్యూహాత్మక సహకారం, రెండవది ఆరోగ్య సంరక్షణ భాగస్వామ్యం, దాని వివిధ అంశాలు. మూడవది టెక్నాలజీ, డిజిటల్ స్టార్టప్, ఇన్నోవేషన్, నాల్గవది పర్యావరణం, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, ఐదవది విద్య ఈ సమస్యలపై ప్రధాని తన పర్యటనలో దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
రికార్డు క్రియేట్ చేయనున్న ప్రధాని మోదీ:
భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు మాట్లాడుతూ.. అమెరికా పార్లమెంట్ లో రెండోసారి ప్రసంగించిన భారత తొలి ప్రధానిగా మోదీ రికార్డు క్రియేట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ ప్రసంగం కోసం లక్షాది మంది ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.