Maoists Posters: ములుగు జిల్లా జగన్నాథపురం జంక్షన్ లో మరోసారి మావోయిస్టుల లేఖలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గరువారం ఉదయం వాజేడు మండలంలోని జగన్నాథపురం జంక్షన్ లో ఈ లేఖలు ప్రత్యక్షమయ్యాయి. కాగా, గ్రామాల్లో త్వరలోనే వ్యవసాయం విప్లవం రాబోతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ లేఖల ద్వారా మావోయిస్టులు హెచ్చరించారు.
ఇక ధరణి పోర్టల్ తో రైతులను కేసీఆర్ సర్కార్ దివాళా తీసిందని అన్నలు కరపత్రాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రజలను అన్ని రకాలుగా పీడిస్తున్నాయని లేఖల్లో మావోయిస్టులు సీరియస్ అయ్యారు. పాత,కొత్త భూస్వాములు, కాంట్రాక్టర్లు, గ్రామ పరిపాలకవర్గం అంతా ఓ వ్యవస్థగా ఏర్పడి ప్రజలను అన్ని రకాలుగా దోచుకుతింటున్నారని అన్నలు లేఖల ద్వారా విమర్శలు గుప్పించారు. ఇక పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇస్తూ.. పోలీసు స్టేషన్లు పంచాయితీలు చేసే అడ్డాలుగా మారాయని లేఖలో మావోయిస్టులు ప్రస్తావించారు.
అయితే ధరణి పోర్టల్ పై అధికారప్రతిపక్షాలు తమతమ వాదనను వినిపిస్తున్నాయి. ధరణి పోర్టల్ తో రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ చెబుతుంటే.. అధికార పక్షం మాత్రం ధరణితో అన్నదాతలకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో ధరణి పై మావోయిస్టులు ఈవిధంగా కరపత్రాలు విడుదల చేయడం కలకలాన్ని రేపుతోంది.