కేసీఆర్‌కు (CM KCR) దమ్ముంటే పాలేరు నుంచి పోటీ చేయాలని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) సవాల్ విసిరారు. శనివారం ఖమ్మం సంజీవరెడ్డి భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. నిన్నటి సభలో ఆయన పక్కన కూర్చుంది ఎవరు? ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు లేదన్నారు. నిన్నటి సభలో కేసీఆర్ తన పేరు చెప్పకుండా విమర్శలు గుప్పించారన్నారు. పేరు చెప్పి ఉంటే తన సత్తా ఏమిటో తెలిసేదని అన్నారు. ఇప్పటికీ తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. ఉమ్మడి ఖమ్మంలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా గెలవనిచ్చేది లేదన్నారు. కాంగ్రెస్‌కు 80 నుంచి 82 సీట్లు వస్తున్నాయన్నారు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని జోస్యం చెప్పారు.
ఇది కూడా చదవండి: DK Shiva Kumar: కర్ణాటకకు రండి చూపిస్తాం.. కేసీఆర్, కేటీఆర్ కు డీకే శివకుమార్ సవాల్
జనాన్ని మోసం చేసేందుకే సొల్లు కబుర్లు..
‘‘డబ్బు అహంకారంతో అధికార మదంతో విర్రవీగే కేసీఆర్ మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది.. కేసీఆర్‌కు ఛాలెంజ్ చేస్తున్న.. తడిబట్టలతో ఏ గుడికి వస్తారో రండి.. నాకు ఏ పైరవీలు చేశారు... ఏ కాంట్రాక్టులు ఇచ్చారో చెప్పండి.. నేను కూడా తడిబట్టలతో అదే గుడికి వస్తా’’నని పొంగులేటి సవాల్ చేశారు. పాలేరులో దళితబంధు గురించి మాట్లాడుతున్నారని, హుజూరాబాద్‌లో గెలవటం కోసం ప్రకటించారని, అక్కడ ఏం జరిగిందో ప్రజలు చూశారన్నారు. ఓట్లు వేయకపోతే రెస్ట్ తీసుకుంటామని సీఎం అంటున్నారని.. ఇప్పడు మటుకు చేసేది ఏముంది? కేవలం సోల్లు కబుర్లు చెబుతూ జనాన్ని మోసం చేయటమే కదా అని సెటైర్లు వేశారు.
కేసీఆర్‌కు లక్షల కోట్లు ఎక్కడివి..?
అక్రమంగా సంపాదించిన డబ్బు నోట్ల కట్టలతో వస్తున్నానని సీఎం కేసీఆర్ అంటున్నారని, తాను కష్టపడి సంపాదించిన డబ్బు అని అధికారికంగా చెప్పగలనని పొంగులేటి అన్నారు. మరి ముఖ్యమంత్రి ఏ వ్యాపారం చేశారని, లక్షల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం తెలంగాణను దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు. ఇంత నీచమైన రాజకీయ నాయకుడిని ఎక్కడా చూడలేదన్నారు. మేడిగడ్డ పరిస్దితి ఏమైందని ప్రశ్నించారు. మేడిగడ్డ కేసీఆర్ ఏటీఎంగా మారిందని ప్రధాని మోడీతో సహా అందరూ చెప్పారన్నారు. సీఎం కేసీఆర్ పతనానికి మేడిగడ్డ చివరి మెట్టని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.