- పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లోకే!
- రాహుల్ తో జూమ్ మీటింగ్
- 22న హస్తం గూటికి నేతలు
- చేరిక తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభ
- ఈ అంశంలో బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్స్
బీజేపీలో చేరాలా..? కాంగ్రెస్ గూటికి వెళ్లాలా..? అని అనేక చర్చలు, సమావేశాలు, తర్జనభర్జనల అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం పార్టీకే జై కొట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని ప్రచారం సాగుతోంది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కు తెరదించుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
పొంగులేటితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ ద్వారా చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భేటీ తర్వాత ఈనెల 22న కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని పొంగులేటి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పొంగులేటితో పాటు జూపల్లి, ఎమ్మెల్సీ దామోదర్ కూడా అదే రోజున హస్తం గూటికి చేరనున్నట్టు టాక్. రాహుల్ తో జూమ్ మీటింగ్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నట్లు సమాచారం.
వీరి చేరిక అనంతరం ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. రాహుల్ గాంధీ ఈ నెల 21న విదేశాల నుంచి ఢిల్లీ రానున్నారు. అదేరోజున రేవంత్ హస్తినలో ఉంటారని.. చేరికలపై చర్చలు జరుపుతారని వార్తలు వస్తున్నాయి.
పొంగులేటి, జూపల్లి కోసం బీజేపీ కూడా అనేక చర్చలు జరిపింది. కానీ, అవేవీ ఫలించలేదు. ఏకంగా చేరికల కమిటీ కన్వీనర్ రాజేందర్ సైతం వీళ్ల చేరికపై సరైన క్లారిటీ ఇవ్వలేకపోయారు. పైగా, కర్ణాటకలో బీజేపీ ఓటమి పొంగులేటి, జూపల్లిని ఆలోచనలో పడేసింది. కమలం పంచన చేరితే ఉపయోగం లేదని.. కాంగ్రెసే బెటర్ అని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.