MLA Sitakka: కామ్రెడ్ సీతక్క వర్సస్ కామ్రెడ్ తనయ బడే నాగజ్యోతి ఫైట్ తో ములుగు రాజకీయాలు అప్పుడే హీటెక్కుతున్నాయి. ఎలాగైనా సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్కకు చెక్ పెట్టాలని అధికార పక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఒకే బ్యాక్ గ్రౌండ్ తో ఈ నియోజకవర్గం నుంచి ఇద్దరు మహిళలు పోటీలో ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇక్కడి గిరిజనపుత్రులు పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
డబ్బుల సంచులతో దిగుతున్నారు...!
ములుగులో తనను ఓడించడానికి బీఆర్ఎస్ నేతలు డబ్బు సంచులతో దిగుతున్నారని ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించడానికి బీఆర్ఎస్ మిడతల దండు వస్తోందన్నారు ఆమె. అయితే తాను ఎక్కడా భూకబ్జాలు చేయాలేదని.. అక్రమంగా కేసులు పెట్టించలేదన్నారు. ఇక ప్రజల్లో తనకు వస్తున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేకే తనను టార్గెట్ చేస్తున్నారని సీతక్క ఆరోపించారు.
ప్రజల మధ్యే ఉండడం తాను చేస్తున్న తప్పా అని ఆమె నిలదీశారు. తన పనితనాన్ని అసెంబ్లీలో మెచ్చుకుంటూనే మరోవైపు ఇక్కడికి వచ్చి తనను ఓడిస్తానని బీఆర్ఎస్ అంటోందని సీతక్క మండిపడ్డారు. అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రశ్నించే గొంతుకను చట్టసభల్లోకి వెళ్లనీయకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో ములుగు నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి.
ఇది కూడా చదవండి: థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే సత్తా కేసీఆర్ కే ఉంది - అసదుద్దీన్ ఓవైసీ