ప్రజాకవి గద్దర్ మృతిపై ప్రముఖుల సంతాపం.. ఎవరెవరు ఏమన్నారంటే?

ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూతపై పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుభంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. మంచి వ్యక్తిని కోల్పోయామని ఆదేదన వ్యక్తంచేస్తున్నారు.

New Update
ప్రజాకవి గద్దర్ మృతిపై ప్రముఖుల సంతాపం.. ఎవరెవరు ఏమన్నారంటే?

ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూతపై పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూతపై పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుభంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్ షర్మిల, భట్టి విక్రమార్క, సీతక్క తదితర రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ఎన్.శంకర్, పరుచూరి గోపాలకృష్ణ, ఆర్.నారాయణమూర్తి తదితర సెలబ్రెటీలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

"తెలంగాణ దిగ్గజ కవి, ఉద్యమకారుడు శ్రీ గుమ్మడి విట్టల్‌రావు మరణం గురించి విని చాలా బాధపడ్డాను. తెలంగాణ ప్రజలపై ఆయనకున్న ప్రేమే అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసేలా చేసింది. ఆయన వారసత్వం మనందరికీ స్ఫూర్తిదాయకంగా కొనసాగాలి" అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

గద్దర్ మృతి చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సంతాపం తెలియజేశారు.

ప్రజాకళలకు, ఉద్యమాలకు గద్దర్‌ చేసిన సేవలు మరువలేనివి, తెలంగాణ పాటకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిన కళాకారుడు గద్దర్‌ మృతి బాధాకరమని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. గద్దర్ మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో పాటతో పల్లెపల్లెన తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపజేశారన్నారు. ఈ సందర్భంగా గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

"బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్. గద్దర్ పాటలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయి' అంటూ గద్దర్ మృతిపై సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు.

'ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి బాధించింది. ప్రజా ఉద్యమాలకు పాటతో ఊపిరి పోశారు. గద్దర్ మృతితో ప్రశ్నించే గొంతు మూగబోయింది. పౌరహక్కుల ఉద్యమాల్లో గద్దర్ పాత్ర మరువలేనిది’అంటూ చంద్రబాబు తెలిపారు.

గద్దర్ మరణం బాధాకరం. తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారని కేటీఆర్ పేర్కొన్నారు.

"నీ గానం… తెలంగాణ వేదం. నీ గజ్జె… తెలంగాణ గర్జన. నీ గొంగడి… తెలంగాణ నడవడి. నీ గొంతుక… తెలంగాణ ధిక్కార స్వరం. నీ రూపం… తెలంగాణ స్వరూపం. గద్దరన్నా… నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం. నీ మరణం… నా గుండెకు శాశ్వత గాయం"అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

"ప్రజా గాయకుడి గొంతు మూగబోయింది. తెలంగాణ ఉద్యమ గళం గద్దర్‌" అంటూ లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు శ్రీ గద్దర్ గారి మరణం తీవ్ర విషాదకరం అంటూ జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

"ఇది అత్యంత విషాదభరితమైన వార్త. ప్రజాపోరాటాల మహాశిఖరం ఒరిగిపోయింది, మానవత్వం, త్యాగనిరతి, మహోన్నతమైన వ్యక్తిత్వం, ప్రజల గొంతు మూగపోయింది. గద్దరన్న ఇక లేడన్న వార్త కలిచివేసేదిగా ఉంది" అని షర్మిల తెలిపారు.

ప్రజా ఉద్యమకారుడు గద్దర్ గళం అజరామరం, ఏ పాట పాడినా దానికో ప్రయోజనం ఉండేలా గొంతెత్తి పోరాడిన ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దరన్నకు లాల్ సలాం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

"తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అంటూ బాలకృష్ణ తెలిపారు.

"ఆయన రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్పూర్థిని నింపిన ప్రజా గాయకుడు గద్దర్ గారు మన మధ్యన లేకున్నా, ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటుంది. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." అని జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలియజేశారు.

"ఒక అన్నమయ్య పుట్టారు..దివంగతులయ్యారు. ఒక రామదాసు పుట్టారు... దివంగతులయ్యారు. ఒక పాల్ రబ్సన్ పుట్టారు... దివంగతులయ్యారు. ఒక గద్దర్ పుట్టారు... దివంగతులయ్యారు. ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది"అని ఆర్. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు.

తదితర సినీ రాజకీయ ప్రముఖులు కూడా గద్దర్ మరణంపై సంతాపం తెలియజేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు