/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/AP-Pentions--jpg.webp)
ఏపీలో పెన్షన్ల పంపిణీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ చేపట్టొద్దంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాలతో ఈ రోజు ఉదయం సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేశారు. అయితే.. వేర్వేరు ప్రాంతాల్లో పెన్షన్ కోసం వెళ్లిన ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ఈ ఘటనలపై వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. చంద్రబాబు ఫిర్యాదు కారణంగానే ఇళ్ల వద్దకు వాలంటీర్లు వెళ్లి పెన్షన్ ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. దీంతో వృద్ధులు ఎండలో అవస్థలు పడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఫించన్ కోసం వేచి ఉన్న ఓ వృద్ధురాలు ఎండ దెబ్బకు గురై మరణించింది. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి ఒకే సమయానికి ఇరు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు బోడె ప్రసాద్, జోగి రమేష్ చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫించన్ ఆలస్యం అవడానికి చంద్రబాబు కారణం అని వైసీపీ నేతలు అనడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ జోగివర్గీయుల నినాదాలు చేయగా.. పోటీగా జగన్ డౌన్ డౌన్ అంటూ బోడే అనుచరుల నినాదాలు చేశారు.
పెన్షన్ కోసం వేచివున్న వృద్ధుడు మృతి
యర్రావారిపాలెం మండలం నెరబైలు గ్రామంలో ఫించన్ కోసం వెళ్లిన వృద్ధుడు షేక్ అసం సాహెబ్ కళ్లు తిరిగి కింద పడ్డాడు. దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా అతను చనిపోయాడు.