ఏపీలో రాజకీయ కాక రేపుతోన్న వాలంటీర్ల వ్యవస్థ

కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాలంటీవర్ల వ్యవస్థ చుట్టూనే తిరుగున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర రెండో దశలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలతో పాటు వాలంటీర్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాకుండా పవన్‌పై పరువునష్టం కేసు కూడా దాఖలుచేశారు.

New Update
ఏపీలో రాజకీయ కాక రేపుతోన్న వాలంటీర్ల వ్యవస్థ

political fight on volunteers issue in ap

వాలంటీర్లు చుట్టూనే రాజకీయాలు..

ఏపీలో ఎన్నికలకు మరో 9నెలలు సమయం ఉన్నా కూడా అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వారాహియాత్రతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ ముందుకు సాగారు. ముఖ్యంగా కొందరు వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డారని పవన్ చేసిన సంచలన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇప్పటికీ ఆ దుమారం కొనసాగుతూనే ఉంది. వాలంటీర్లు డేటా చౌర్యం చేస్తున్నారంటూ పవన్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఆయన దిష్టిబొమ్మలను వాలంటీర్లు తగలబెట్టి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు కూడా పవన్ వ్యాఖ్యలపై తీవ్ర స్వరంతో కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. మరో అడుగు ముందుకేసి పవన్‌పై ఓ మహిళా వాలంటీర్ విజయవాడ సివిల్ కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు.

ఓటర్ల తనిఖీల్లో వాలంటీర్లు వెళ్లడంపై ఫిర్యాదులు..

ఈ అంశం ఇలా ఉండగానే.. ఓటర్ల జాబితా తనిఖీలో వాలంటీర్లు కూడా పాల్గొంటున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఓటర్ల తనిఖీలో వాలంటీర్లు పాల్గొనడం చట్ట విరుద్ధం అన్నారు. బూత్ లెవెల్ అధికారులతో పాటూ వైసీపీ నేతలు, వాలంటీర్లూ ఇంటింటి సర్వే ప్రక్రియలో భాగం అవుతున్నారని తెలిపారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని.. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఓటర్ల తనిఖీల్లో వాలంటీర్లు వెళ్లిన ఫొటోలను అటు టీడీపీ కూడా ఎన్నికల సంఘానికి అందజేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో వాలంటీర్లు వెళ్లిన జిల్లాల నుంచి వెంటనే రిపోర్టులు ఇవ్వాలని కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది.

పవన్‌కు కాపు నేత జోగయ్య మద్దతు..

మరోవైపు వాలంటీర్లపై పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు మాజీ మంత్రి, కాపు సీనియర్ నేత హరిరామజోగయ్య మద్దతు పలుకుతూ లేఖ రాశారు. అవసరమైతే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలన్న పవన్ ఆలోచన మంచిదేనన్నారు. అయితే పూర్తిగా రద్దు చేయడం కంటే కొన్ని సంస్కరణలతో వాలంటీర్ వ్యవస్థ పునర్ నిర్మించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అత్యధికంగా మహిళలకే వాలంటీర్లగా అవకాశం కల్పించాలని తెలిపారు. వాలంటీర్ల సమస్యలను పరిష్కరించే దిశగా పవన్ కల్యాణ్ కృషి చేయాలని సూచించారు. రెండున్నరల లక్షల మంది వాలంటీర్లు రూ.5వేల అరకొర వేతనంతో జీవిస్తున్నారని.. వారికి కనీస వేతనం రూ.10వేలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

వాలంటీర్లను పర్మినెంట్ చేయాలి..

అటు బీజేపీ ఏపీ శాఖ కూడా వాలంటీర్ల వ్యవస్థపై తన విధానాన్ని స్పష్టంచేసింది. వాలంటీర్లపై అమితమైన ప్రేమను ఒలకబోస్తున్న వైసీపీకి.. నిజాయితీ ఉంటే తక్షణమే వాలంటీర్లను పర్మినెంట్ చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. పర్మినెంట్ చేయకపోతే ప్రభుత్వంపై వాలంటీర్లు తిరగబడాలని ఆయన సూచించారు. మొత్తానికి ఏపీలో ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ చుట్టూనే రాజకీయం నడుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు